బాబూ.. ఇంతకంటే మేలైన విధానాలు ఉంటే చెప్పండి

27 Jul, 2022 04:30 IST|Sakshi

విద్యార్థుల మేలు కోసమే విలీన ప్రక్రియ

ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని బెదిరించటం సమంజసం కాదు

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసమే పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ప్రభుత్వ విధానంపై ఉపాధ్యాయ సంఘాల తీరు సహేతుకంగా లేదని మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని, ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మేలు చేసేందుకేనని, అందుకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ ఉండాలని తాను చెప్పానని, ఉపాధ్యాయులు కూడా 8 గంటలు పనిచేయాలని తెలిపారు.

ఉద్యోగ రీత్యా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఉద్యమాల పేరుతో ప్రజల్లో చులకన కారాదని ఉపాధ్యాయ సంఘాలకు హితవు పలికారు. నూతన విద్యా విధానం ప్రకారం మూడో తరగతి నుంచి ప్రత్యేకంగా తరగతి ఉపాధ్యాయుడిని నియమిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు అంతా ప్రభుత్వ విధానాలను అభినందిస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడు ఉండాలన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.

ఇంతకన్నా మేలైన విధానాలు ఉంటే చంద్రబాబు చెప్పాలని, విద్యార్థులకు మేలు జరిగే విధానాలు ఏవైనా తాము ఏ భేషజాలు లేకుండా స్వీకరిస్తామని అన్నారు. జిల్లాల్లోని పాఠశాలలపై స్థానిక ఎమ్మెల్యేల నుంచి వినతులు తీసుకున్నామని, 5,800 స్కూళ్లను మ్యాపింగ్‌ చేస్తే సుమారు 400 స్కూళ్ల నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఆయా జిల్లా జాయింట్‌ కలెక్టర్లతో కమిటీని వేశామని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సానుభూతి కాదు.. సాయం కావాలి
ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చేసిన మన వైద్య విద్యార్థులు ఇక్కడ చదువు కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. మంగళవారం ఈఏపీసెట్‌–2022 ఫలితాలు విడుదల చేసిన సందర్భంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాధానమిచ్చారు. విధిలేని పరిస్థితుల్లో చదువులు ఆపేసి భారత్‌కు తిరిగొచ్చిన మన విద్యార్థులపై ఇప్పుడు చూపాల్సింది సానుభూతి కాదని.. వారికి సాయం కావాలని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు