కేంద్రం చెప్పేదొకటి... చేసేదొకటి...

11 Sep, 2023 03:00 IST|Sakshi

బీజేపీ బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకునేది ఎర్రజెండానే: బృందా కారత్‌

సెప్టెంబర్‌ 17 వేడుకలు కమ్యూనిస్టుల సొత్తు, హక్కు అని వ్యాఖ్య

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది మరొ కటని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ విమర్శించారు. పూర్తిగా అబద్ధాలు, వక్రీకర ణలు, విద్వేష ప్రసంగాలతో  దేశాన్ని పాలిస్తున్నార ని ధ్వజమెత్తారు. కులమతాలతో సంబంధం లేకుండా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన చారిత్రక తెలంగాణ రైతాంగ సా యుధ పోరాట చరిత్రను కూడా ముస్లింరాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయ త్నం చేయడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు.

ఆదివారం సుందరయ్య పార్కు వద్ద సీపీఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా బృందా కారత్‌ మాట్లాడుతూ బ్రిటిషర్లకు సలాంకొట్టిన ఆర్‌ ఎస్‌ఎస్, సంఘ్‌ పరివార్‌ శక్తులు ఇప్పుడు తెలంగాణ వి మోచన దినం జరుపుతామని బయలుదేరడం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులే ఆనాడు బ్రిటిషర్లు, నిజాం, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేశారని  ఆమె గుర్తు చేశారు. దాని ఫలితంగానే హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని చెప్పారు.

తెలంగాణకు ద్రోహం చేసిన వారే సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌కు వచ్చి వేడు కలు నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ పోరాటం కమ్యూనిస్టుల సొత్తు, వారి హక్కు అని స్పష్టం చేశారు. సీపీఎం హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి. నర్సింహ్మరావు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
 

మరిన్ని వార్తలు