పెట్రో రేట్లు పెంచి 4 లక్షల కోట్లు లాగేశారు

11 Jul, 2021 02:05 IST|Sakshi

బహరాంపూర్‌: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్‌ ధరలను 69 సార్లు పెంచిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి శనివారం చెప్పారు. ఈ పెంపుతో ప్రభుత్వం ఏకంగా రూ.4.91 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించిందని అన్నారు. పెట్రోల్‌ ధర రూ.100 దాటిందని, డీజిల్‌ సైతం సెంచరీకి చేరువలో ఉందని, ఇక గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.850కి ఎగబాకిందని ఆక్షేపించారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో రూ.25 లక్షల కోట్లు రాబట్టుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సామాన్యుల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను రద్దు చేసిందని, తద్వారా ధర లీటర్‌కు రూ.12 చొప్పున తగ్గిపోయిందని గుర్తుచేశారు. మిగతా అన్ని రాష్ట్రాలూ ఇదే తరహాలో ప్రజలకు ఉపశమనం కల్పించాలని అధిర్‌ రంజన్‌ చౌదరి కోరారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గాలంటే వ్యాట్‌ ఎత్తివేయాలని విన్నవించారు.   

మరిన్ని వార్తలు