ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా?

7 Nov, 2022 16:12 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరచుగా ఒక మాట అంటుంటారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ట చతుష్టయం విషం కక్కుతోందని, ప్రజలకే మంచి చేసినా, చెడుగా ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుతో పాటు  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 మీడియా సంస్థలను కలిపి దుష్టచతుష్టయం అని పేరు పెట్టారు. వీరికి తోడుగా దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్‌ తీరును ఆయన ఎండగడుతుంటారు. ఆయన వ్యాఖ్యలు కరెక్టేనా? కాదా అన్న విశ్లేషణ చేస్తే మాత్రం ఒక పచ్చి నిజం బయటపడుతుంది.

మీడియా ముసుగులో పచ్చ కుట్ర
చంద్రబాబు టీడీపీ అధినేతగా, మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం ఉన్న వ్యక్తిగా ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు చేయవచ్చు. అందులో నిజాలు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. ఆయన చేసే రాజకీయ విమర్శలకు వైసీపీ కూడా రాజకీయంగానే సమాధానం ఇస్తుంది. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 మీడియా సంస్థలు విలువలకు పాతరేసి నిత్యం విషం కక్కుతున్న తీరు బాధ కలిగిస్తుంది.

అవి ఒక రకంగా ఏపీ ప్రజలపై పగపట్టినట్లు వ్యవహరిస్తున్నాయన్న సంగతి విశ్లేషణలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లను, తప్పు ఒప్పులను మీడియా వార్తలుగా ఇవ్వడం తప్పు కాదు. నిజానికి అలాంటి వార్తలు ఇవ్వాలి కూడా. కానీ అబద్దాలతో రోజూ దిక్కుమాలిన కథనాలు ఇవ్వడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలని నానా తంటాలు పడుతున్నాయి. ఏపీ ప్రజలు విజ్ఞులు కనుక వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదనుకోవాలి. 

పదేళ్ల నుంచి ఇవే కుట్రలు
2019 ఎన్నికలకు ముందు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా ఎన్ని స్టోరీలు ఇచ్చినా, వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలని ఎన్ని విషపు రాతలు రాసినా ప్రజలు వాటిని పట్టించుకోలేదు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చి జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారు. దానిని ఈ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. జగన్ సీఎం అయిన మరుసటి రోజునుంచే ఏదో ఒక తప్పుడు కథనం వండి వార్చడం ఆరంభించారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నాయి. అయినా ఆయన ధైర్యవంతుడు కనుక తను ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేయడానికి ముందుకు వెళ్లారు. 
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు