పల్లాకు డబ్బు మదం ఎక్కువైంది: సొంత పార్టీ నేతపై ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

29 Aug, 2023 10:22 IST|Sakshi

సాక్షి, చేర్యాల(సిద్దిపేట): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి డబ్బు మదం ఎక్కువైందని, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అధర్మం, సీఎం సంకల్పానికి విరుద్ధమని ముత్తిరెడ్డి ఆరోపించారు.

ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఫోన్లుచేస్తూ డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వారిని ‘కుక్కలు’అనడం పల్లా అహంకారానికి నిదర్శనమన్నారు. 

నాకే నర్సాపూర్‌ టికెట్‌ ఇవ్వాలి..
రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, తనకు నర్సాపూర్‌ టికెట్‌ కావాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఏ ఆలోచనతో నర్సాపూర్‌ టికెట్‌ ప్రకటించకుండా ఆపారో తెలియదని, పునరాలోచించి తనకే ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి బీఆర్‌ఎస్‌లో చేరారని, ఇక్కడ కేబినెట్‌ కేడర్‌ హోదాలో ఉన్నారని పరోక్షంగా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు.  తనకు మంత్రి హరీశ్‌రావు అండదండలు ఉన్నాయన్నారు. టికెట్‌ ఇవ్వకుంటే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా.. టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.  
చదవండి: Thummala: తుమ్మల చేజారిపోకుండా..

టికెట్‌ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం 
సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈసారి తనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌ అన్నారు. ఆయన సోమవారం మహబూబాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా మహబూబాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంత బలం ఉన్న తనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఒక వేళ ఇవ్వకపోతే ఖద్దరు బట్టలు కాకుండా.. ఎర్రటి వస్త్రాలు ధరించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు