ప్రాపకం కోసం బీజేపీ, జనసేన మధ్య అంతర్యుద్ధం

25 Nov, 2020 11:05 IST|Sakshi

అభ్యర్థిత్వం కోసం ఢిల్లీలో పవన్‌ ఎదురుచూపులు 

తిరుపతిలో బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటారన్న జీవీఎల్‌ 

అమరావతిలో జనసేన చేసిన విమర్శలపై కమలదళంలో చర్చ 

సాక్షి, తిరుపతి:  జనసేన పేరుకు సొంత పార్టీ అయినా అధినేత పవన్‌కల్యాణ్‌ ఒంటరిగా పోటీచేసే ధైర్యం చేయలేక కమలనాథుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వ్యూహత్మంగా అడుగులు వేస్తోంది. బీజేపీ భాగస్వామ్య పక్షంగా చేరి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. సీట్లు పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నీడలో మెలుగుతోంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన పవన్‌ మాటమార్చారు. జనసేన ప్రకటనతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ బరిలో నుంచి పవన్‌ తప్పించారు. వెంటనే బీజేపీ అభ్యర్థులకు పవన్‌ మద్దతును సైతం ప్రకటించారు. ఈ పరిణామం జన సైనికుల్లో ఆగ్రహం, అసంతృప్తి, నిరాశకు దారితీసింది. మరో వైపు గత ఎన్నికల్లో తిరుపతిలో నోటాకు పడ్డ ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. అయినా కమలనాథులు తమ బలం ఏమిటో తెలిసినా, ఎంపీ స్థానం ఉప ఎన్నికల్లో జనసేన ద్వారా వచ్చే చిల్లర ఓట్ల కోసం పాకులాడుతోందనే ప్రచారం జరుగుతోంది.  

ఢిల్లీలో పవన్‌ ఎదురుచూపులు  
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన నేతల ఆశలపై పవన్‌ నీళ్లు చల్లారని సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు మంగళవారం తిరుపతిలో జనసేన నాయకులకు షాక్‌ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే బరిలో ఉంటారని ప్రకటించారు. మరోవైపు తమ అభ్యర్థుల తరఫున పవన్‌ ప్రచారం చేయాలని బీజేపీ పట్టుపడుతోంది. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో తిష్టవేసి బీజేపీ నేతల ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నారు.   (చదవండి: నాకెందుకీ తలనొప్పి.. ఏ మొహంతో ఓట్లడగాలి!)

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలను కలిసి తిరుపతి సీటు జనసేనకు కేటాయించమని కోరేందుకు ఆయన వేచి ఉన్నారు. అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే అంశంతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తన ప్రచారం చేసే అంశంపైనా స్పష్టత తీసుకునేందుకు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటును తమకు కేటాయించాలని పవన్‌ షరతు పెట్టే అవకాశం కూడా ఉంది.   

జన సైనికులకు అమరావతి తలనొప్పులు  
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తిరుపతి సీటును వదులుకునే పరిస్థితుల్లో కమలనాథులు లేరు. అదే విధంగా జనసైనికులపై కమలనాథులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో నిర్వహించిన సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికపై జనసేన నాయకులు ప్రస్తావించారు. తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థే ఉండేలా పట్టుపట్టాలని జన సైనికులు పవన్‌పై ఒత్తిడి తెచ్చారు.  (చదవండి: తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు)

ఇక్కడ బీజేపీ నాయకుల ప్రభావం లేదని, వారు కేవలం పేపరు పులులే తప్ప పోటీచేసే ధైర్యం లేని వారని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై బీజేపీ శ్రేణులు జనసేన నాయకుల తీరుపై లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. తిరుపతి సీటు కేటాయిస్తే నిండా మునిగిపోతామని ఇరు పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం.    

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా