పైకి పొత్తులు.. లోపల కత్తులు

15 Nov, 2023 05:26 IST|Sakshi

ఉమ్మడి తూర్పు గోదావరి టీడీపీ, జనసేన పార్టీల తీరిది

పిఠాపురం సంయుక్త సమావేశంలో బాహాబాహీ

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి వర్మపై విరుచుకుపడిన జనసేన నేతలు

పవన్‌ ఎక్కడా గెలవలేదని ఎద్దేవా చేసిన వర్మ

బూతులు తిట్టుకుంటూ కుర్చీలు, బల్లలతో తలపడిన శ్రేణులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ/పిఠాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి.

రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వెలుపల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైంది. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగడం చర్చనీయాంశమైంది.

ఇలా మొదలైంది
పిఠాపురం పట్టణ టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రెండు పార్టీల నేతలు సమన్వయ సమావేశం పేరిట భేటీ అయ్యారు. టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మ, జనసేన నుంచి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ పార్టీ నేతలతో కలసి సమావేశానికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మ ప్రారంభోపన్యాసం చేస్తూ.. నియోజకవర్గంలో రూ.2,800 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని చెప్పుకున్నారు.

మరి అంత అభివృద్ధి చేస్తే నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓడించారని జనసేన ఇన్‌చార్జి తంగెళ్ల శ్రీనివాస్‌ ప్రశ్నించారు. టీడీపీ తరఫున గెలిపించినా.. చేసిన అభివృద్ధి ఏమీ లేదని వర్మను ఉద్దేశించి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేయకపోవడంతోనే గత ఎన్నికల్లో ఓడిపోయారని, వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతిచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. 

‘మీ పవన్‌ అన్నిచోట్లా ఓడిపోయారు’
జనసేన ఇన్‌చార్జి శ్రీనివాస్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఇన్‌చార్జి వర్మ రాష్ట్రంలో తానొక్కడినే ఓడిపోలేదని అతిరథ మహారథులు సైతం ఓడిపోయారన్నారు. ‘మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ ఓటమి చూడలేదు. కానీ.. మీ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అన్నిచోట్లా ఓడిపోయార’ని వర్మ కౌంటర్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తనకు 75 వేలు ఓట్లు వస్తే.. జనసేనకు కేవలం 35 వేలు మాత్రమే వచ్చాయని గుర్తు చేసుకోవాలన్నారు. దీనిని బట్టి మీ సత్తా ఏపాటిదో.. మా సత్తా ఏపాటిదో ప్రజలే నిర్ణయించారన్నారు.

ఈ తరుణంలో జనసేన నేతలు వర్మకు వ్యతిరేకంగా కేకలు వేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ‘అప్పట్లో టీడీపీ సీటు ఇవ్వకుండా బయటకు గెంటేస్తే దొంగ ఏడుపులు ఏడ్చిన విషయం గుర్తు లేదా. జాలిపడి జనసేన సహా అంతా కలిసి ఓటేసి గెలిపించిన విషయం గుర్తు లేదా’ అని జనసేన నేతలు వర్మను నిలదీశారు. 

బల్లలు, కుర్చీలు తన్నేసిన జనసేన
టీడీపీ నాయకుడు కొండేపూడి ప్రకాశ్‌ మాట్లాడుతూ.. టీడీపీ నేతలను జనసేనలో జాయిన్‌ చేసుకోవద్దని.. జనసేన వారిని టీడీపీలో చేర్చుకోవద్దని సూచించగా మరోసారి గందరగోళం నెలకొంది. ఇంతలో జనసేన నాయకులు కల్పించుకుని దిక్కులేని పరిస్థితుల్లో టీడీపీ వాళ్లే జనసేనలోకి వచ్చి చేరుతున్నారని, తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లడం లేదన్నారు. దీంతో టీడీపీ ఇన్‌చార్జి వర్మ సహా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు.

టీడీపీ నేత వర్మతో మనకు పనిలేదంటూ జనసేన ఇన్‌చార్జి ఉదయశ్రీనివాస్‌ సహా జనసేన నేతలు, ఆ పార్టీ శ్రేణులు అంతా కలిసి మూకుమ్మడిగా సమావేశంలో బల్లలు, కుర్చీలు తన్నేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇరుపార్టీల సమన్వయ సమావేశం రసాభాసగా ముగిసింది.

మరిన్ని వార్తలు