Congress Chintan Shivir: ఒక కుటుంబం.. ఒకే టికెట్‌

14 May, 2022 06:14 IST|Sakshi

రెండో వ్యక్తి పోటీ చేయాలంటే కనీసం ఐదేళ్లు పని చేయాల్సిందే

50 ఏళ్లలోపు వారికి 50 శాతం పదవులు

పార్టీలో పదవీ కాలం ఐదేళ్లే

కాంగ్రెస్‌లో పరివర్తన దిశగా కీలక నిర్ణయాలు

‘నవ్‌ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ వేదికగా పార్టీలో మథనం

ఉదయ్‌పూర్‌ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: భవిష్యత్‌ ఎన్నికల్లో ‘ఒక కుటుంబం, ఒకే టిక్కెట్‌’ నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండో టికెట్‌ ఆశించే వ్యక్తి కనీసం ఐదేళ్లపాటు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ఉండాలి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ్‌ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ శుక్రవారం ప్రారంభమైంది.

పార్టీలో మార్పు తీసుకొచ్చే దిశగా నేతలు మథనం సాగిస్తున్నారు. ‘ఒక కుటుంబం.. ఒకే టిక్కెట్‌’ సహా అనేక నియమాలను ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో ఆమోదించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఒకే కుటుంబానికి ఒకే టికెట్‌ నిబంధన, మినహాయింపు ఫార్ములా గాంధీ కుటుంబంతో సహా పార్టీ శ్రేణులందరికీ వర్తిస్తుందని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ తెలిపారు. ఈ నిబంధనపై పార్టీలో దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. ఐదేళ్ల తర్వాత ఎవరినీ పార్టీ పదవి కొనసాగించకూడదని, మళ్లీ అదే పోస్టు కోరితే కనీసం మూడేళ్లు కూలింగ్‌ పీరియడ్‌లో ఉంచాలన్న అంశాలపై చింతన్‌ శిబిర్‌లో చర్చ జరిగిందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు
కాంగ్రెస్‌లో ప్రతి స్థాయిలో ఉన్న పార్టీ కమిటీల్లో 50 ఏళ్లలోపు వారికి 50 శాతం (ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ) పదవులు కేటాయించాలనే ప్రతిపాదన సైతం పార్టీ పెద్దల పరిశీలనలో ఉంది. పార్టీలో ఎలాంటి పని చేయనివారి పిల్లలు, బంధువులకు టికెట్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనపై కాంగ్రెస్‌ రాజకీయ ప్యానెల్‌ సభ్యుల మధ్య దాదాపు పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. పార్టీ ఆఫీస్‌ బేరర్ల పనితీరును పర్యవేక్షించేందుకు ‘అసెస్‌మెంట్‌ వింగ్‌’ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు, ఎన్నికలకు సమాయత్తం కావడానికి సర్వేలు చేసేందుకు ‘ప్రజా అంతర్‌దృష్టి విభాగం’ ఏర్పాటుపై సమాలోచనలు జరుగుతున్నాయి.

పార్టీలో బూత్, బ్లాక్‌ స్థాయిల మధ్య మండల కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో మండల కమిటీలో 15–20 బూత్‌లు ఉంటాయి. బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీలో 3–4 మండలాలు ఉంటాయి. చింతన్‌ శిబిర్‌ కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్స్‌ చేసిన సూచనలను ఆమోదించిన తర్వాత పార్టీలో అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు కనిపించనుందని ఏఐసీసీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. చింతన్‌ శిబిర్‌లో మొదటి రెండు రోజులు చర్చలు సాగుతాయి. చివరి రోజు తీర్మానం చేస్తారు. ఈ తీర్మానం ముసాయిదాపై అదే రోజు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చిస్తారు.  

సెల్‌ ఫోన్లకు అనుమతి లేదు!
ఉదయ్‌పూర్‌లోని తాజ్‌ ఆరావళి రిసార్ట్‌లో జరుగుతున్న నవ్‌ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌లో దాదాపు 450 మంది నేతలు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి రైలులో ఉదయ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి నేతలు, కార్యకర్తలు రాజస్థానీ సంప్రదాయ స్వాగతం పలికారు. చర్చల వివరాలు బయటికి పొక్కకుండా మొబైల్‌ ఫోన్లను హాల్‌ బయట డిపాజిట్‌ చేసిన తర్వాతే నేతలను లోపలికి అనుమతించారు. వేదిక వద్ద మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా కాంగ్రెస్‌ దిగ్గజాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

తెలుగు నేతల సందడి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు కాంగ్రెస్‌ నేతలు చింతన్‌ శిబిర్‌కు హాజరయ్యారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు