-

మీడియా పాయింట్‌ తొలగించడం అప్రజాస్వామికం: కాంగ్రెస్‌

8 Sep, 2020 15:08 IST|Sakshi

కాంగ్రెస్‌కు కేవలం ఆరు నిమిషాల సమయం మాత్రమే ఇస్తున్నారు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సమస్యలకు పరిష్కారం లభించేది దేవాలయం లాంటి శాసన సభలోనే.. కానీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాల శాసనసభ సమావేశాలు రెండో రోజులో భాగంగా మంగళవారం భట్టీ మాట్లాడుతూ.. 19మంది శాసన సభ్యులున్న కాంగ్రెస్ సభ్యుల్లో కొందరిని కేసీఆర్ కలుపుకున్నారు. 19మంది ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ఉన్న సభ్యుల ప్రకారమే సమయం ఇస్తున్నారు. కేవలం 6 నిమిషాలు మాత్రమే కాంగ్రెస్‌కు మాట్లాడటానికి సమయం ఇస్తున్నారు.. ఇది చాలా దారుణం అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: జీవన్‌ రెడ్డి
ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని జీవన్‌ రెడ్డి మండి పడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ తొలగించడం అప్రజాస్వామికం..దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది.. స్పీకర్ మీడియా పాయింట్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని జీవన్‌ రెడ్డి కోరారు. (చదవండి: కేసీఆర్‌ తీర్మానం : వ్యతిరేకించిన ఎంఐఎం)

ఇలా అయితే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు: కోమటిరెడ్డి రాజగోపాల్‌​ రెడ్డి
పీవీ నరసింహారావు ఘన కీర్తిని పొగిడి, సోనియా దేవత అని ప్రశంసించిన కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ కాంగ్రెస్‌ను బొంద పెడతా అని వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను మాట్లాడనివ్వటం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ లాంటి నియంతను సీఎంగా కోరుకోవట్లేదు అన్నారు. తెలంగాణ కేసీఆర్ అబ్బ సొత్తు కాదు. ప్రత్యేక రాష్ట్రం 1,000 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదన్నారు. కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వటానికి కూడా కేసీఆర్ సమయం ఇవ్వట్లేదు. బయట సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు, అసెంబ్లీలో మాట్లాడనివ్వటంలేదు అలాంటప్పుడు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే అసెంబ్లీ పెట్టుకోవాలని తీవ్రంగా మండి పడ్డారు రాజగోపాల్‌ రెడ్డి. 

మరిన్ని వార్తలు