కాంగ్రెస్‌లో విభేదాలు!

24 Aug, 2020 02:43 IST|Sakshi

నాయకత్వంలో సమగ్ర మార్పు కోరుతూ సీనియర్ల లేఖ

పార్టీలో కలకలం

గాంధీ కుటుంబమే అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలన్న మరో వర్గం

నేడు కీలక సీడబ్ల్యూసీ సమావేశం

న్యూఢిల్లీ: కీలక సీడబ్ల్యూసీ భేటీ నేడు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ అగ్ర నాయకత్వంలో సమూల మార్పు కావాలని కోరుతున్న వర్గం ఒకవైపు, రాహుల్‌ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న మరో వర్గం తెరపైకి వచ్చాయి. పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్‌ నేతలు ఇటీవల సోనియాగాంధీకి లేఖ రాశారు.

మరోవైపు, గాంధీ కుటుంబ సభ్యులే కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం అందించగలరని మరికొందరు నేతలు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు, అభిమానం ఉన్న నాయకుడిగా రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ చేపట్టాలని పలువురు సీనియర్లు డిమాండ్‌ చేశారు. కాగా, పార్టీ నాయకత్వంలో మార్పు కావాలని కోరుతూ రాసిన లేఖపై ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించినట్లు తెలుసోంది. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. (అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా..!)

ఈ విషయాన్ని పార్టీలోని సన్నిహిత నేతలకు ఆమె ఇప్పటికే స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని వెల్లడించాయి. అయితే, సోనియా పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారన్న వార్తలను కాంగ్రెస్‌ ఖండించింది. సోనియా గాంధీ నుంచి అలాంటి ప్రకటనేదీ రాలేదని పార్టీ స్పష్టం చేసింది.

పార్టీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీ కొనసాగడమో, లేక రాహుల్‌ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడమో సరైన నిర్ణయమని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురి, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్‌ ఖుర్షీద్, అశ్విన్‌ కుమార్, కేకే తివారీ తదితరులు అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసినవారిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ, శశి థరూర్, కపిల్‌ సిబల్, మనీశ్‌ తివారీ, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హూడా తదితరులున్నారు. గత సంవత్సరం ఆగస్ట్‌ 10న సీడబ్ల్యూసీ అభ్యర్థన మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు అయిష్టత చూపి తప్పుకొన్న విషయం తెలిసిందే.  

చాలా మార్పులు జరగాలి..
పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని, పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలని సోనియాకు రాసిన లేఖలో సీనియర్లు కోరారు. అధికారం కేంద్ర స్థాయిలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం, ప్రతీ చిన్న అంశాన్ని అగ్ర నాయకత్వమే నిర్ణయించడం దీర్ఘకాలంలో పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తుందని వారు ఆ లేఖలో హెచ్చరించారు. నాయకత్వ స్థాయిలో అనిశ్చితి వల్ల పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరిస్తుందని, అది చివరకు పార్టీని బలహీన పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా రూపొందే సమగ్ర, క్రియాశీల నాయకత్వంలోనూ నెహ్రూ–గాంధీ కుటుంబం కీలక భూమిక నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూ దార్శనికత కాంగ్రెస్‌ పార్టీకి దిక్సూచిగా కొనసాగుతుందన్నారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక బృందం సీడబ్ల్యూసీ ఎంపిక, పనితీరుపైనా వారు లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాజ్యాంగంలో పేర్కొన్న విధానం ద్వారా సీడబ్ల్యూసీ ఏర్పడాలన్నారు.

అలాగే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలను మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. సాధ్యమైనంత త్వరగా పార్టీ పునరుత్తేజం కోసం చర్యలు చేపట్టాలన్నారు.  వ్యవస్థీకృత, సమీకృత నాయకత్వ విధానం తక్షణావసరమన్నారు.  బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సీడబ్ల్యూసీ సమర్ధంగా పని చేయడం లేదని అభిప్రాయపడ్డారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికే ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదన్నారు. దేశంలో ప్రస్తుతం అభద్రతతో కూడిన భయ వాతావరణం నెలకొని ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనే క్రియాశీల విపక్షంగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను కూడా సీనియర్లు ఆ లేఖలో తప్పుబట్టారు. ఆ నిర్ణయం రాహుల్‌ గాంధీదేనన్న విషయం గమనార్హం. డీసీసీ అధ్యక్షుల నియామక నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడి సూచనల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తీసుకునేలా చూడాలన్నారు.  నిష్పక్షపాత విధానంలో సంస్థాగత ఎన్నికలు జరగాలని కోరారు.

ప్రజాస్వామ్య, లౌకిక వేదిక
ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించాలని సూచించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలన్నారు.

మళ్లీ రాహుల్‌ రావాలి
ఇదిలా ఉండగా, రాహుల్‌ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతూ మరి కొందరు నేతలు లేఖ రాశారు. ఎంపీ మానికం ఠాగోర్‌ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘గాంధీలు త్యాగానికి గుర్తులు. రాహుల్‌ గాంధీ మళ్లీ అధ్యక్షుడు కావాలని 1,100 మంది ఏఐసీసీ సభ్యులు, 8,800 పీసీసీ సభ్యులు, 5 కోట్లమంది పార్టీ కార్యకర్తలు, 12 కోట్లమంది పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు’అని ఆయన పేర్కొన్నారు.

గాంధీ కుటుంబమే బెస్ట్‌
ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఇది సరైన సమయం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టి విపక్షం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బలమైన, ఐక్య విపక్షం లేకపోవడం బీజేపీకి కలసి వస్తోందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా.. మొత్తం పార్టీ కోరుకునే, శ్రేణులందరికీ చిరపరిచితుడైన నాయకుడు కావాలని, గాంధీ కుటుంబ సభ్యులే అందుకు సరైన వారన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్త లేని గ్రామం దేశంలో లేదని, ఆ ఘనత గాంధీ కుటుంబం కారణంగానే సాధ్యమైందని తెలిపారు. కోరుకున్నంత కాలం సోనియాగాంధీనే ప్రెసిడెంట్‌గా ఉండాలని, ఆ తరువాత రాహుల్‌ ఆ బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. సీనియర్ల లేఖ దురదృష్టకరమని రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. నాయకత్వానికి సంబంధించి ఎన్నికల నిర్వహణ ఈతరుణంలో సరైన నిర్ణయం కాదని, దానివల్ల విభేదాలు పెరిగే అవకాశముందని సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అభిప్రాయపడ్డారు. రాహుల్‌కు పార్టీ శ్రేణులు, నాయకుల మద్దతుందన్నారు.

పార్టీ రాజ్యాంగం ప్రకారం..
పార్టీ రాజ్యాంగం ప్రకారం.. సీడబ్ల్యూసీలో పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్లో పార్టీ నేత, 23 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఆ 23 మందిలో 12 మందిని ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఎన్నుకుంటుంది. మిగతావారిని పార్టీ ప్రెసిడెంట్‌ ఎంపిక చేస్తారు. 1990 నుంచి సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగలేదు. అప్పటినుంచి, ఏకగ్రీవ మార్గంలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక జరుగుతోంది.

కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించిన తాజా లేఖలో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్‌ నేతలు సంతకాలు చేశారు. వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్‌ సిబల్, శశి థరూర్, పీజే కురియన్, ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీ, రేణుకా చౌదరి, మిలింద్‌ దేవ్‌రా, అజయ్‌ సింగ్, ముకుల్‌ వాస్నిక్, జితిన్‌ ప్రసాద, భూపిందర్‌ సింగ్‌ హూడా, రాజిందర్‌ కౌర్‌ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్‌ చవాన్, రాజ్‌ బబ్బర్, అరవింద్‌ సింగ్‌ లవ్లీ, సందీప్‌ దీక్షిత్‌ తదితరులున్నారు. నేడు జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో ఈ లేఖలోని అంశాలపై లోతైన, వాడి వేడి చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు