ఇంటికో ఓటు వేయండి... 

21 Oct, 2021 03:48 IST|Sakshi

నిరుద్యోగులకు లేఖలు రాయాలని కాంగ్రెస్‌ నిర్ణయం 

నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై కొట్లాడేందుకు తమకు ఓటేయాలని అభ్యర్థన 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇంటికో ఓటు తమ పార్టీకి వేయాలంటూ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. నియోజకవర్గంలోని 80వేల ఇళ్లలో ఇంటికో ఓటు తమకు వేయాలని, తద్వారా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై పోరాడేందుకు తమకు బలం ఇవ్వాలని కోరుతూ ముందుకెళ్తోంది. నియోజకవర్గంలోని నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్న నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది నిరుద్యోగులకు త్వరలోనే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పక్షాన లేఖలు రాయనున్నట్టు సమాచారం. ఈ లేఖలో నిరుద్యోగ సమస్యలను ప్రస్తావించడంతోపాటు పార్టీ నిరుద్యోగుల పక్షాన చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ తమకు ఓటు వేయాలని నిరుద్యోగుల తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా గ్రామస్థాయి ప్రచారంలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందని విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, వారి ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లి ప్రచారం చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

చివర్లోనే ఉధృతంగా.. 
ఇప్పటికే నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం చేపడుతున్న కాంగ్రెస్‌ ప్రచార చివరిదశలో మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చివరి మూడు రోజుల్లో ఆయన దాదాపు 10 చోట్ల ప్రచారం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ అక్కడే ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ఇప్పటికే ఓమారు ప్రచారానికి వెళ్లి వచ్చిన వీహెచ్‌ శుక్రవారం మళ్లీ వెళ్లనున్నారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా ప్రచారానికి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంమీద టీఆర్‌ఎస్, బీజేపీలకు దీటుగా ప్రచారం ముగించాలనే యోచనతో కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందిస్తుండటం గమనార్హం.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు