ఓవర్‌ టు ఢిల్లీ..! | Sakshi
Sakshi News home page

ఓవర్‌ టు ఢిల్లీ..!

Published Tue, Dec 5 2023 12:56 AM

Selection of Telangana CM candidate for Congress AICC President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం పొద్దంతా భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారా­ల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో సమావేశమైన కొత్త ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, అధిష్టానం స్పందన కోసం ఎదురుచూసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నేతృత్వంలోని పరిశీలకుల బృందం.. ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది.

మంగళవారం పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్ర­క్రియ ముగిసేందుకు రెండు రోజుల సమ­యం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. 

ఏకవాక్య తీర్మానానికి ఆమోదం  
సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎల్లా హోటల్‌ వేదికగా కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. కాంగ్రెస్‌ నుంచి తాజాగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్‌ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకులు కేజీ జార్జి, దీపాదాస్‌మున్షీ, అజయ్‌కుమార్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. తొలుత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్‌ మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి.. సీఎం ఎంపిక వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి తీర్మానాన్ని సమరి్థంచగా.. మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. 

సీఎం ఎవరైతే బాగుంటుంది? 
ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పేర్లు చెప్పారని, ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్‌ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూసింది.

కానీ డీకే బృందాన్ని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపిక వ్యవహారంపై హైకమాండ్‌ పెద్దలతో చర్చించనున్నారు. సీఎం క్యాండిడేట్‌పై స్పష్టతకు వచ్చాక రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించి, అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం. తర్వాత సీల్డ్‌ కవర్‌లో సీఎం అభ్యర్థి పేరును హైదరాబాద్‌కు పంపి, సీఎల్పీ సమావేశంలో సదరు నేతను ఎన్నుకుంటారని తెలిసింది. 

గెలిచిన వారికి అభినందనలు 
ఢిల్లీలోని సోనియా నివాసంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అభినందించింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ నేతలు జైరాం రమేశ్, మాణిక్యం ఠాగూర్‌ తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐసీసీ పరిశీలకులతో మాట్లాడాక హైకమాండ్‌ తుదినిర్ణయం తీసుకుంటుందన్నారు. 
 
సోమవారమే ప్రమాణమంటూ హడావుడి! 
సోమవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం ముగియకముందే కాంగ్రెస్‌ పక్షాన సీఎం ఎంపిక పూర్తయిందని, సాయంత్రమే రాజ్‌భవన్‌లో సీఎం, ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. గాం«దీభవన్‌ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ పెద్దలు డీకే టీమ్‌ను ఢిల్లీకి పిలిపించాక ఈ హడావుడి ఆగిపోయింది. 
 
హడావుడి వద్దు... ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి 
సీఎల్పీ సమావేశానికి ముందు హోటల్‌ పార్క్‌ హయత్‌లో కీలక సమావేశం జరిగింది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, దామోదర రాజనర్సింహ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న హడావుడి పార్టీకి నష్టం చేస్తుందని వారు డీకేతో పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఫలానా వారికి సీఎం పదవి ఇవ్వవద్దని మేమేమీ అనడం లేదు. కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలి.

ఆ అభిప్రాయాలపై నిర్ణయం తీసుకునేందుకు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజల్లోకి పంపాల్సింది ‘స్ట్రాంగ్‌’ మెసేజ్‌ కాదు.. ‘స్మార్ట్‌’ మెసేజ్‌. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసి ఫలితాలు సాధించాల్సిన బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వారు డీకేకు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తును, పార్టీ పట్ల విధేయత, అనుభవాలను ఆచితూచి అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని వారు పేర్కొన్నట్టు తెలిసింది.   

Advertisement
Advertisement