‌లాక్‌డౌన్‌‌ విధించే ఆలోచన లేదు: సీఎం

20 Nov, 2020 21:21 IST|Sakshi

ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వ్యాఖ్య

భోపాల్‌: రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. అయితే కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా పాఠశాలలు, కళాశాలల మూసివేత కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శుక్రవారం సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం భోపాల్‌లో జరిగింది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా పకడ్భందీ చర్యలు తీసుకోడం కోసం జిల్లాల అధికారులు విపత్తు నిర్వహణ శాఖ వారితో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ ఆదేశించారు.

షాపుల నిర్వహణ సమయాన్ని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు నిర్ణయిస్తారని, రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన అన్నారు. ప్రజా రవాణాతో పాటు నిత్యావసర వస్తువుల రవాణా కొనసాతుందన్నారు. ఆర్ధిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడకుండా కరోనా వ్యాప్తిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలకు, కార్మికులకు ఎలాంటి నిబంధనలు ఉండవన్నారు. కోవిడ్‌ రక్షణ చర్యలు పాటిస్తూ వివాహ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, అయితే పరిమిత సంఖ్యలోనే బంధువులు హాజరవ్వాలని ప్రజలను కోరారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లను ఓపెన్‌ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి శివరాజ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు