రాహుల్‌ వ్యాఖ్యలు.. రాజీనామాకు సిద్ధపడ్డ ఆజాద్‌

24 Aug, 2020 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో సీనియర్‌ నేతల మధ్య వాడివేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి సోనియా గాంధీ అనారోగ్య పరిస్థితులు, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లో బీజేపీ సృష్టిస్తున్న అననుకూల పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదంటూ లేఖ రాసిన తీరును ఖండించినట్లు సమాచారం. (కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు!)

ఈ క్రమంలో రాహుల్‌ వ్యాఖ్యలపై సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన రాజీనామాకు సైతం సిద్ధపడినట్లు సమాచారం.  మరోవైపు తాను అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు సోనియా గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబ విధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. 

అదే విధంగా.. పార్టీ అధినాయకత్వాన్ని తక్కువ చేసి చూపేలా లేఖ రాయడం సరికాదంటూ సహచరులపై అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీలో మార్పులు కోరుతూ రాసిన ఈ లేఖ తనను బాధించిందన్నారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాత్రం సోనియా గాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్‌ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో గులాం నబీ ఆజాద్‌ కూడా ఉన్నారు.

బీజేపీతో కలిసి కుట్రపన్నామా?: కపిల్ సిబల్
‘‘మేము బీజేపీతో కలిసి కుట్ర చేశామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడి రాజస్థాన్ హైకోర్టులో విజయం సాధించాం. 30 ఏళ్లలో మేము బీజేపీకి అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాం. అయినప్పటికీ మేము బీజేపీతో కుట్రపన్నామా ?’’ అని  కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు