Dalit Bandhu: జర్మన్‌ హంగర్‌ టెక్నాలజీతో కేసీఆర్‌ సభ.. ఎందుకంటే?

16 Aug, 2021 07:37 IST|Sakshi

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి సభా ప్రాంగణం ముస్తాబైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 మేలో ఇదే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సైతం ఇదే శాలపల్లి వేదికగా ప్రారంభించడం గమనార్హం. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల కంటే ఈ పథకం ఆది నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే.. సభను అనుకున్నదాని కంటే ఎక్కువరెట్లు విజయవంతం చేసేలా సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శాలపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభాస్థలికి వస్తారు.

కొద్ది నిమిషాల వ్యవధిలోనే సభ మొదలవుతుంది. సభా ఏర్పాట్లను ఆదివారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సభకు నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్షా ఇరవై వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకుగాను అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. 

జర్మన్‌ హంగర్‌ టెక్నాలజీతో సభ..
జర్మన్‌ హంగర్‌ టెక్నాలజీతో సభ ఏర్పాట్ల పూర్తి చేశారు. ఎంత భారీవర్షం పడినా, గాలులు వీచినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినా ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. 

15 మంది ఎంపిక ఇలా జరిగింది..!
నియోజకవర్గం నుంచి ఎంపికైన 15 మంది దళిత కుటుంబాల ఎంపికపై సంఖ్యాపరమైన సమాచారాన్ని అధికారులు అందజేశారు. అందులో జమ్మికుంట మండలం గ్రామీణ ప్రాంతం నుంచి ఇద్దరు, టౌన్‌ నుంచి ఇద్దరు, హుజూరాబాద్‌ మండలం టౌన్‌ నుంచి ఇద్దరు, రూరల్‌ నుంచి ఇద్దరు, వీణవంక మండలం నుంచి ఇద్దరు, ఇల్లందకుంట నుంచి ఇద్దరు, కమలాపూర్‌ నుంచి ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరంతా కుటంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. అధికారులు వీరి వివరాలు వెల్లడించకపోయినా.. ఈ కుటుంబాలను సభాస్థలికి రప్పించేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశారు. వీరికి సభాప్రాంగణంపై కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు.

200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్‌
ఈ సభలో 200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్‌ ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్‌ పక్కనే మరో డయాస్‌ కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్‌లో వెనుక కూర్చున్న వారు కనిపించేలా నిర్మాణం చేశారు. ఈ సభలో మొత్తంగా 10 బ్లాకులు ఏర్పాట్లు చేశారు. 5 బ్లాకుల్లో మహిళలు, మరో 5 బ్లాకుల్లో పురుషులు కూర్చుండేలా కుర్చీలను సమకూర్చారు. 

లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం..
దళితబంధు సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు గాను అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 825 బస్సుల్లో దళితబంధువులు హాజరవుతారని సమాచారం. బస్సులు సభా వేదికకు దాదాపు 500 మీటర్ల దూరంలో నిలుపుతారు. అక్కడ వారు దిగిన తర్వాత సభా వేదికకు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 25 ఎకరాల స్థలంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

గులాబీమయంగా హుజూరాబాద్‌
ప్రతిష్టాత్మకమైన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో అంబేద్కర్‌ చౌరస్తా నుంచి శాలపల్లి వరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు గులాబీ తోరణాలను కట్టారు. వరంగల్‌–కరీంనగర్‌ రహదారి, జమ్మికుంట రోడ్‌ రహదారి గులాబీమయంగా మారింది. సభా వేదికకు సమీపంలో సీఎం కేసీఆర్‌ భారీ కటౌట్‌లను ఏర్పాటుచేశారు. 

20 మంది ఐపీఎస్‌.. 4,600 మందికిపైగా పోలీసులు
దళితబంధు సభా సజావుగా సాగేందుకు 4,600 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దళితబంధు ఎంపికపై ఇప్పటికే పలుచోట్ల ప్రజలు, పార్టీలు వరుసగా నిరసనలు చేస్తుండటంతో ముందుజాగ్రత్తగా భారీ రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆందోళనలు జరగవచ్చన్న నిఘావర్గాల సమాచారంతో డేగ కళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఒక అడిషనల్‌ డీజీ అధికారి హైదరాబాద్‌ నుంచి వస్తున్నారు. నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ, రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం సీపీ విష్ణువారియర్, వరంగల్‌ సీపీ తరుణ్‌జోషితోపాటు పలువురు ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్‌లతో కలిపి మొత్తం 20 మంది ఐపీఎస్‌ అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దాదాపు 60 మంది డీఎస్పీలు, 200 సీఐలు బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. వీరికితోడు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్, ఫైర్‌సిబ్బంది అదనం. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు