టిక్కెట్ తండ్రికి ఇవ్వాలా? కూతురుకి ఇవ్వాలా?

19 Sep, 2023 07:22 IST|Sakshi

రాజకీయాల్లో అన్న దమ్ముల సవాళ్ళు చూశాం. తండ్రీ కొడుకుల సవాళ్ళు చూశాం. తాజాగా తెలంగాణలో తండ్రీ కూతుళ్ళ సవాళ్ళు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆయనో సీనియర్ నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామని తన నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. అదే నియోజకవర్గానికి ఆయన కుమార్తె కూడా దరఖాస్తు చేశారు. ఇప్పుడు టిక్కెట్ తండ్రికి ఇవ్వాలా? కూతురుకి ఇవ్వాలా? పార్టీ నాయకత్వానికి పరీక్ష పెట్టిన ఆ ఇద్దరు ఎవరో చూద్దాం.

✍️ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం ఎస్‌సీ రిజర్వుడు సీటు. ఇక్కడి నుంచి మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ మూడు సార్లు విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో తన హవా నడిచినా..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దామోదరకు కాలం కలిసి రావడంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ రాజనర్సంహకు ఓటమి ఎదురైంది. అందుకే ఈ సారి ఎలాగైనా తన తండ్రిని గెలిపించాలన్న పట్టుదలతో దామోదర రాజనర్సింహ కూతురు త్రిష నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు.

✍️ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రిని గెలిపించాలని కాంగ్రెస్‌ కేడర్‌కు నూరి పోస్తున్నారు. అయితే ఇటీవల గాంధీభవన్‌లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నవారిలో తండ్రి రాజనర్సంహతో పాటుగా ఆయన కుమార్తె త్రిష కూడా దరఖాస్తు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తండ్రికి పోటీగా బిడ్డ కూడా పార్టీలో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గాంధీభవన్‌లో కలకలం రేపింది.


✍️గత కొంత కాలంగా దామోదర కుమార్తె త్రిష ఆందోల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతే కాదు నియోజకవర్గంలో రోజుకు ఒక గ్రామం చొప్పున పల్లెబాట పేరుతో ప్రజల్లో ఉంటూ..స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. అయితే దామోదర రాజనర్సింహ మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలకు హాజరు కావడంలేదు. అదే సమయంలో ఆయన కుమార్తె త్రిష ఉత్సాహంగా ప్రజల్లో తిరగుతుండటం..ఆయనేమో దూరంగా ఉండటం..ఇప్పుడు ఇద్దరూ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. 

✍️పార్టీలో సీనియర్ నేత అయిన రాజనర్సింహను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సిడబ్లుసి సభ్యత్వం కట్ట బెట్టడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సహం నింపింది. అయతే ఆయన మాత్రం ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి  కార్యక్రమం చేపట్టకపోగా..కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందు దామోదర అధికార పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతే కాదు జహిరాబాద్ ఎస్సి రిజర్వుడ్ స్థానం నుంచి దామోదర పోటీ చేస్తారని కూడా ఆందోల్‌లో ప్రచారం సాగింది.  

✍️ఏది ఏమైనా దామోదర రాజనర్సింహ మౌనం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆందోల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా దామోదర రాజనర్సింహ బరిలో ఉంటారా లేదా ఆయన కుమార్తె త్రిష పోటీ చేస్తారా అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్ని పీడిస్తోంది. మరి ఆందోల్ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరిదనే సస్పెన్స్‌ ఎప్పటికి వీడుతుందో చూడాలి..

మరిన్ని వార్తలు