రక్తపు కూడు తినమనే సీన్‌.. ఏం సినిమాలివి? కలిసి ఒకటిగా బతకనివ్వరా?

16 May, 2022 19:01 IST|Sakshi

కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్ధుల్లా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పేరిట దేశంలో మత ద్వేషాల్ని మరింత పెంచుతున్నారని, ఇలాంటి సినిమాలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిని ఉద్దేశిస్తూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి మతోన్మాద జాడ్యానికి ముగింపు పడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

1990లో కశ్మీరీ పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా వివేక్‌ అగ్నిహోత్రి ది కశ్మీర్‌ ఫైల్స్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే.  తాజాగా జమ్ము కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్‌ రాహుల్‌ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపడం, కశ్మీరీ పండిట్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేడం, వాళ్లను కట్టడి చేసేందుకు బలగాలు కఠిన చర్యలు చేపట్టడం లాంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో కశ్మీరి పండిట్లకు మద్ధతుగా జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాను కలిశారు ఫరూక్‌ అబ్దుల్లా. 

‘‘ఎల్జీ వద్ద కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రస్తావన కూడా వచ్చింది. ఇలాంటి సినిమాలు దేశంలో ద్వేషాలను పెంచుతున్నాయి. ఒక ముస్లిం హిందువును చంపి.. అతని రక్తపు కూడును భార్యతో తినమనడం ఏంటి? ఇలాగ జరుగుతుందా? అసలు.. సినిమా పేరుతో ఇష్టమొచ్చినట్లు చూపించి.. మనుషుల మధ్య చిచ్చు పెడతారా? ఇలాంటి వాటికి ముగింపు పడాల్సిన అవసరం ఉంది’’ అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్ధుల్లా అభిప్రాయపడ్డారు. 

కొందరు ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు. వాళ్ల చర్యలు మంచివి కావు. కశ్మీరీలోని ముస్లిం యువత ఈ తీరుతో ఊగిపోతుంది అంటూ చెప్పుకొచ్చారాయన. అలాగే భద్రత కోరుతున్న కశ్మీరీ పండిట్లపై టియర్‌ గ్యాస్‌, లాఠీ ఛార్జీ ప్రయోగించడం ఏంటి? ఆ అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. ‘‘వాళ్లు(కశ్మీరీ పండిట్లు) రాళ్లు రువ్వారని భద్రతా సిబ్బంది చెప్తోంది. కానీ, ఈనాటికీ ఈ గడ్డపై కశ్మీరీ పండిట్లు రాళ్లు విసరడం నేను చూసింది లేదు’’ అని ఫరూఖ్‌ చెప్పారు. 

కశ్మీర్‌ పండిట్లతో కలిసిపోవాలనే మేం అనుకుంటాం. ఒకటి కలిసి బతకాలనే అనుకుంటున్నాం. బుద్గంలో నిరసనలు చెబుతున్న కశ్మీర్‌ పండిట్లకు సానుభూతి తెలిపేందుకు మమ్మల్ని అనుమతించడం లేదు. అనుమతించకపోతే.. అసలు వాళ్లకు దగ్గర అయ్యే అవకాశం మాకు ఎక్కడ దొరుకుతుందని ఫరూఖ్‌ అన్నారు.

చదవండి: చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?.. నిరసనలకు కశ్మీరీ ముస్లింల మద్దతు

మరిన్ని వార్తలు