భారత్‌ జోడో యాత్ర అడ్డుకునేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నించింది

31 May, 2023 13:17 IST|Sakshi

శాన్ ఫ్రాన్సిస్కో: భారత్‌ జోడో యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం శతవిధాల ప్రయత్నాలు చేసిందని.. ప్రజలు సంఘటితంగా దానిని విజయవంతం చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మంగళవారం శాన్‌ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

భారత్ జోడో యాత్రను ఆపేందుకు ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించింది. బీజేపీ.. తన అధికారిని ఉపయోగించి ప్రజలను బెదిరించింది. అలాగే ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసింది. కానీ ఏదీ ఫలించకపోగా.. యాత్ర ప్రభావం మరింతగా పెరిగింది. జాయిన్ ఇండియా అనే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయంలో పాతుకుపోయినందువల్లే ఇది జరిగింది. 

ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు కావాల్సినదంతా ఆర్సెస్‌-బీజేపీ నియంత్రణలో ఉండిపోయింది. అందుకే భారత్‌ జోడో యాత్రను ప్రారంభించాల్సి వచ్చిందని రాహుల్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అవి(ఆరెస్సెస్‌-బీజేపీలను ఉద్దేశించి..) భారత రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉన్నాయి. దేశంలో ప్రజల నడుమ కులం, మతం అనే గీతలు గీసి విభజించేందుకు చూస్తున్నాయి. అయితే..

భారత్ జోడో యాత్ర దేశ ప్రజలను ఏకం చేసింది. భారత్ జోడో యాత్ర ఆద్యంతం ప్రేమ, అప్యాయత, గౌరవంతో కొనసాగింది. ఒకసారి దేశ చరిత్రను గమనిస్తే గురునానక్ దేవ్ జీ, గురు బసవన్న జీ, నారాయణ గురు జీ వంటి ఆధ్యాత్మికవేత్తలు దేశాన్ని ఇదే విధంగా ఏకం చేశారు. వాళ్ల మార్గంలో నేను కూడా దేశ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ స్పష్టం చేశారు.

2022, సెప్టెంబర్‌ 7వ తేదీన కన్యాకుమారిలో మొదలైన భారత్‌ జోడో యాత్ర.. దాదాపు మూడువేలకిలోమీటర్ల  పాటు సాగి ఈ ఏడాది జనవరి 30వ తేదీన కన్యాకుమారిలో ముగిసింది.  

ఇదిలా ఉంటే.. మరికొన్ని రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈలోపు మూడు నగరాల పర్యటన కోసం అమెరికా వెళ్లిన రాహుల్‌ అక్కడి చట్ట సభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీలను కలుస్తున్నారు. 

ఇదీ చదవండి: రెజ్లర్ల డెడ్‌లైన్‌పై బ్రిజ్‌ స్పందన ఇది


 

మరిన్ని వార్తలు