Karimnagar: టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన

31 May, 2023 13:02 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. మంత్రి గంగుల కమలాకర్‌, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. కాగా, ఆలయ శంకుస్థాపన సందర్భంగా టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు, అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీవారి ఆలయం కరీంనగర్‌లో కొలువుదీరడం మా అదృష్టం. ఆలయానికి 10 ఎకరాల భూమి మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. మా విజ్ఞప్తిని మన్నించి టీటీడీ ఆలయం, 20కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం మాకు దొరికిన అదృష్టం అని తెలిపారు. 

అనంతరం, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో మాదిరిగానే కరీంనగర్‌లోనూ సర్వకైంకకర్యాలు జరుగుతాయి. టీటీడీ తరఫున అర్చకులు, సిబ్బంది, ప్రసాదంతో పాలు తదితరాలు ఉంటాయి. కరీంనగర్‌, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్‌, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’

మరిన్ని వార్తలు