కమలంలో కుమ్ములాట! 

27 Sep, 2020 10:05 IST|Sakshi

కార్యకర్తలు తక్కువ.. గ్రూపులు ఎక్కువ

గుర్తింపు కోసం కొందరు.. ప్రచారమే 

పరమావధిగా మరికొందరు

జిల్లా బీజేపీలో షో బ్యాచ్‌ హడావుడి 

పేరుకే జాతీయ పార్టీ. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. జిల్లాలో మాత్రం చతికిలపడింది. కార్యకర్తలు పిడికెడే.. గ్రూపులు మాత్రం గంపెడు.. నిజాయితీగా పార్టీ కోసం పనిచేసేవారు కొందరు.. పబ్లిసిటీ కోసం ఫోజులు కొట్టేవారు మరికొందరు.. వీరికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం.. విలువలు, విధివిధానాలు అవసరంలేదు.. నిత్యం టీవీలు, పత్రికల్లో కనిపించేందుకే పోటీ పడుతుంటారు.. ఎవరైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఫొటో కోసం నిలబడి వెంటనే జారుకుంటారు. ఈ క్రమంలో నిజమైన కార్యకర్తలు మాత్రం గ్రూపు రాజకీయాల్లో నలిగిపోతున్నారు. ఎవరి వెంట నడిస్తే ఏం ముంచుకొస్తుందో అనే సందిగ్ధంలో అవస్థలు పడుతున్నారు.

సాక్షి, తిరుపతి : జిల్లా బీజేపీలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే నాయకులు మాత్రమే ఉన్నారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు. కార్యకర్తలను నాయకులుగా చెప్పుకునేవారు స్వప్రయోజనాలకే వాడుకుంటుంటారు. ముఖ్యంగా పబ్లిసిటీ బ్యాచ్‌లోని నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటారు. పార్టీ విధానాలతో పని లేకుండా టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ వారితోనూ సత్సంబంధాలు సాగిస్తుంటారు. ఇది చూసి నిజమైన కార్యకర్తలు ఎవరితో ఎలా మెలగాలో తెలియక జుట్టుపీక్కోవాల్సి వస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన సీఎం పర్యటనలో పబ్లిసిటీ బ్యాచ్‌ చేసిన రాద్ధాంతమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు చేయరాదని తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి ఆదేశించారు. అయినా కొందరు స్థానిక నేతలు వినలేదు. పత్రికలు, టీవీలో పబ్లిసిటీ కోసం నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో దయాకర్‌రెడ్డి తాము ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదని ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.  

లాబీయింగ్‌పైనే దృష్టి 
కొందరు ఘనులు బీజేపీ కీలక నేతలు, కేంద్రమంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కలరింగ్‌ ఇస్తుంటారు. ఆయా ముఖ్యనేతలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వీరే ముందుండి హడావుడి చేస్తుంటారు. తిరుపతి, శ్రీకాళహస్తి నుంచి లాబీయింగ్‌ చేసే ఆ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పటికప్పుడు అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదు చేసుకుంటుంటారు. ‘నా వల్లే నీకు గుర్తింపు వచ్చింది’ అని ఒకరంటే.. ‘లేదు లేదు నా వల్లే నీ రాజకీయ మనుగడ సాగుతోంది’ అని మరొకరు విమర్శలు చేసుకుంటుంటారు. వీరెవరూ నిజాయితీగా పార్టీ కోసం పనిచేసేవారు కాదని కార్యకర్తలే విమర్శిస్తున్నారు. వీరిలో ఇద్దరు నాయకులు సెటిల్‌మెంట్‌లలో ఆరితేరినట్లు ఆరోపిస్తున్నారు. తమకు కేంద్రమంత్రి బాగా తెలుసని, ఏపనైనా చేసిపెడతామని చెప్పి వ్యవహారాలు నడిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పలువురు అధికారులను సైతం బెదిరించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పబ్లిసిటీ బ్యాచ్‌ స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు