‘దత్తపుత్రుడు’ అట్టర్‌ ఫ్లాప్‌ ఖాయం

25 Apr, 2022 03:10 IST|Sakshi

చంద్రబాబు బ్యానర్‌లో మూడు నెలలుగా చిత్రీకరణ

సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడి వెంట పడుతున్న టీడీపీ అధినేత

బహు భార్యత్వంతో విలువలు లేని వ్యక్తి పవన్‌

విశాఖ టు పుణే టు రష్యా.. ఇప్పుడు ఆమెతో కూడా ఉన్నారో లేదో తెలీదు  

నాడు వ్యతిరేక ఓట్లు చీల్చడానికి పాట్లు.. నేడు చీలకుండా అడుగులు

రైతులను మోసం చేసిన బాబును ఎందుకు ప్రశ్నించలేదు?

ఇప్పుడు అడుగడుగునా రైతు పక్షపాతం కనిపిస్తుంటే ఓర్వలేక విమర్శలా?

కాపుల ఓట్లు కట్టగట్టి బాబు పాదాల వద్ద పడేయడమే మీ లక్ష్యం

మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, అంబటి రాంబాబు ధ్వజం

దొండపర్తి (విశాఖ దక్షిణ)/ సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో చంద్రబాబు బ్యానర్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘దత్తపుత్రుడు’ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవడం ఖాయం. ఒకరు లోకల్‌ (విశాఖ), మరొకరు నేషనల్‌ (పూణె), ఇంకొకరు ఇంటర్నేషనల్‌ (రష్యా).. ఇలా బహు భార్యత్వంతో విలువలు లేని వ్యక్తి దత్తపుత్రుడు పవన్‌. ఇప్పుడు మూడో భార్యతో కూడా ఉన్నారో లేదో తెలీదు. చంద్రబాబు ఎన్ని తప్పుడు పనులు చేసినా ప్రశ్నించని పవన్‌ను దత్తపుత్రుడు అనక ఇంకేమనాలి?’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబులు ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలోని మద్దిలపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అమర్‌నాథ్, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

అప్పుడు ఎందుకు స్పందించ లేదు?
► జనసేన పార్టీకి ప్రత్యేకంగా ఆశయాలు, సిద్ధాంతాలు లేవు. ఈ పార్టీ చంద్రబాబు ఆశయాల కోసమే పని చేస్తోంది. కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే. 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు రూ.87 వేల కోట్లు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి, మోసం చేసిన చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదు?
► రైతుల ఆత్మహత్యలపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు తీసుకోవద్దని చంద్రబాబు ఆదేశించడంతో పాటు అసెంబ్లీ సాక్షిగా రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన విషయం గుర్తు లేదా? మద్యం తాగడం, ఇతరత్రా సమస్యల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు చెప్పినపుడు పవన్‌కల్యాన్‌ ఎందుకు స్పందించలేదు? 
► ముగ్గురు భార్యలను మార్చినట్లు.. రాజకీయ పార్టీ పెట్టిన అయిదేళ్లలో అత్యధిక పార్టీలతో పొత్తులు పెట్టుకున్న రికార్డు పవన్‌ పార్టీకే ఉంది. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత ఉంటుందా? కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కక్ష పూరితంగా జగన్‌పై కేసులు వేశాయి. ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయారు. జైలు జీవితాన్ని అనుభవించినంత మాత్రన జగన్‌ ముద్దాయి కారని గ్రహించే ప్రజలు పట్టం కట్టారు. 

సొంతపుత్రుడిని వదిలేసి..  
► చంద్రబాబు సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడి కోసం పరితపిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ అప్పుడే పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. వ్యతిరేక ఓట్లు చీల్చడానికి నాడు పాట్లు పడిన పవన్‌.. నేడు అవి చీలకూడదని బహిరంగంగా చెబుతుండటం చంద్రబాబును సీఎం చేయాలనే కదా!
► వీరు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌కే ప్రజలు పట్టం కడతారు. ఈ విషయాన్ని ‘సమావేశాల్లో జై పవన్‌ అని అరుస్తారని, ఓట్లు మాత్రం జగన్‌కే వేస్తారని’ పవనే స్వయంగా తన సభలో అంగీకరించారు. 

రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్‌
► 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున 52 లక్షల మంది రైతు కుటుంబాలకు సుమారు రూ.19 వేల కోట్లు అందించారు.
► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు క్రాప్‌ ఇన్సూరెన్స్, కౌలు రైతులకు నష్ట పరిహారం, మరణించిన కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తున్నారు. రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు.  
► టీడీపీ సర్కార్‌ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 469 మంది రైతుల కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ పరిహారం ఇవ్వడం పవన్‌కు కన్పించడం లేదా? ఇలాంటప్పుడు ఆయన్ను దత్తపుత్రుడు అని, చంద్రబాబు చేతిలో పావు కళ్యాణ్‌ అని ఎందుకు అనకూడదు? ప్రజా సంక్షేమం కోసం జనసేన ఉద్భవించి ఉంటే.. ఒంటరిగా పోటీచేసే దమ్ము పవన్‌ కళ్యాణ్‌కు ఉందా? 

నిర్మాత దొరికితే సినిమా తీస్తాం
► వైఎస్సార్‌సీపీ నేతలపై వ్యంగ్యోక్తులు విసిరే పవన్‌ కళ్యాణ్‌.. ఆయనపై మాత్రం సెటైర్లు వేయవద్దని కోరడం హాస్యాస్పదం. పవన్‌ కళ్యాణ్‌కు స్క్రీన్‌ప్లే రాయడం తెలిస్తే.. మాకు సినిమా తీయడమూ తెలుసు. నారా వారి దత్తపుత్రుడు.. బాబు దత్తపుత్రుడు పేర్లతో సినిమా తీయడానికి కథ సిద్ధంగా ఉంది. దర్శకుడూ దొరుకుతారు. ఐదారుగురు హీరోయిన్లు అవసరం కాబట్టి బడ్జెట్‌ ఎక్కువవుతుంది. నిర్మాత దొరకగానే సినిమా తీస్తాం.
► కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఆది నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. వంగవీటి మోహన రంగా హత్య.. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు తీవ్రంగా వేధించిన తర్వాత ఆ సామాజిక వర్గాలు టీడీపీకి మరింత దూరం జరిగాయి. 
► ఆ సామాజిక వర్గాల ఓట్ల కోసం చంద్రబాబు విసిరిన గేలానికి ఎరే పవన్‌ కళ్యాణ్‌. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు కాళ్లదగ్గర పడేయడమే పవన్‌ కల్యాణ్‌ ఉద్దేశం. చంద్రబాబు ప్యాకేజీలకు ఆశపడి పవన్‌ ఆయనకు చాకిరి చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు