గుజరాత్‌ ఎన్నికలు: బీజేపీ ‘పటీదార్‌ పవర్‌’.. వర్కవుట్‌ అయ్యేనా?

1 Jun, 2022 09:22 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల ముంగిట మారుతున్న గుజరాత్‌ రాజకీయ ముఖచిత్రం

పటీదార్‌ పవర్‌  పటీదార్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు

హార్దిక్‌ పటేల్‌ చేరికతో  కమలదళంలో కొత్త జోష్‌

హార్దిక్‌ పటేల్‌. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్‌ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. హార్దిక్‌పై గుజరాత్‌లో బీజేపీ ఎందుకు భారీ ఆశలు పెట్టుకుంది. ఆయన చేరికతో అక్కడ పార్టీ మరింత బలం పుంజుకుంటుందా?
 
ఎవరీ పటీదార్లు? గుజరాత్‌లో వారికి ఎందుకంత ప్రాధాన్యం...?

పటీదార్లు తాము శ్రీరాముని వారసులమని చెప్పుకుంటారు. వీరిలో లేవా, కడ్వా అని ప్రధానంగా రెండు ఉపకులాలున్నాయి. రాముడి కవల పిల్లలైన లవకుశల్లో లవుడి సంతతి లేవా పటేల్స్‌ కాగా, కడవా పటేల్స్‌ కుశుడి సంతతి అంటారు. లేవాలు సౌరాష్ట్ర, మధ్య గుజరాత్‌లో అధికంగా ఉంటే, ఉత్తర గుజరాత్‌లో కడ్వాల ప్రాబల్యం ఎక్కువ. పటీదార్లలో 80% మంది లేవా, కడ్వా పటేల్స్‌. మిగతా 20%లో సత్పంతి, అంజన వంటి ఉపకులాలున్నాయి. ఒకప్పుడు వ్యవసాయదారులైన వీరు ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాల్లోనూ బాగా ఎదిగి ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు.  

హర్దిక్‌ బలం ఎంతంటే.. 
గుజరాత్‌ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా దూసుకొచ్చిన యువ నాయకుడు హార్దిక్‌ పటేల్‌. 2015 ముందు వరకు ఆయన పేరు ఎవరికీ తెలీదు. రాష్ట్రంలో అగ్రకుల జాబితాలో ఉన్న పటీదార్లను ఓబీసీలోకి చేర్చాలని,  విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిప్పులు చెరిగే ప్రసంగాలతో బీజేపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూ యూత్‌లో ఫాలోయింగ్‌ సంపాదించారు. పటేల్‌ ఉద్యమం సందర్భంగా రాష్ట్రంలో హింస, గృహ దహనాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయనపై బీజేపీ దేశద్రోహం సహా ఎన్నో కేసులు పెట్టింది. బెయిల్‌పై బయటికొచ్చాక కూడా కేంద్రంలో, గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చారు. కాంగ్రెస్‌ గెలవకపోయినా పటీదార్ల ఓట్లను భారీగా చీల్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు హార్దిక్‌ కాంగ్రెస్‌లో చేరారు. కానీ గుజరాత్‌లో 26 లోక్‌సభ సీట్లలో కాంగ్రెష్‌ ఒక్కటీ నెగ్గలేదు. 2020లో హార్దిక్‌ను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్‌ నియమించింది. కానీ ఆ తర్వాత ఆశించిన ప్రాధాన్యం లభించక మూడేళ్లలోనే పార్టీ వీడే పరిస్థితులు వచ్చాయి. 

ముందునుంచే హార్దిక్‌పై కన్ను 
నెల క్రితం కాంగ్రెస్‌కు గుడ్‌ బై కొట్టిన హార్డిక్, ఆ సందర్భంగా సోనియాగాంధీకి రాసిన లేఖలో ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం తదితరాలను ప్రశంసించారు. దాంతో ఆయన బీజేపీలో చేరతారని అప్పుడే భావించారు. పార్టీ కూడా ఆయన్ను చేర్చుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా 2015 కోటా ఆందోళన సమయంలో ఆయనపై పెట్టిన కొన్ని కేసుల్ని వెనక్కు తీసుకుంది. రాష్ట్రంలో 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అన్ని మార్గాలనూ బీజేపీ వెదుకుతోంది. అందులో భాగంగా అత్యంత కీలకమైన పటీదార్ల ఓట్లపై దృష్టి పెట్టింది. 28 ఏళ్ల హార్దిక్‌ చేరికతో యువత, రైతులు పార్టీ పట్ల మరింతగా ఆకర్షితులవుతారని అంచనా వేస్తోంది. కోటా కేసుల్లో హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ వచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి లైన్‌ క్లియరైంది. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ సమక్షంలో హార్దిక్‌ పార్టీలో చేరనున్నారు. 

ఎన్నికల్లో ప్రభావమెంత? 
పటీదార్లు గుజరాత్‌లో అత్యంత శక్తిమంతమైన సామాజికవర్గం. రాష్ట్ర జనాభాలో వీళ్లు 15% దాకా ఉంటారు. ఠాకూర్ల తర్వాత వీరి సంఖ్యే ఎక్కువ. మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో 70 చోట్ల పటీదార్ల ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఎన్నికల్లో వీరంతా ఒకేతాటిపై వచ్చి ఓటేయరు. ఉపకులాలూ ఉండటంతో వీరిలోనూ విభేదాలున్నాయి. లేవా పటేల్స్‌ మొదట్నుంచీ బీజేపీకి గట్టి మద్దతుదార్లు. కడ్వా ఉప కులానికి చెందిన హార్దిక్‌ 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో వారంతా ఆ పార్టీ వైపు మళ్లారు. బీజేపీ గెలిచినా సీట్లు 115 నుంచి 99కి పడిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవలి కేబినెట్‌ మార్పుచేర్పుల్లో ఏకంగా పటేల్‌ వర్గానికి చెందిన ఏడుగురికి బీజేపీ స్థానం కల్పించింది. హార్దిక్‌ చేరికతో కడ్వా పటీదార్ల ఓట్లు ఈసారి తమకేనని నమ్మకం పెట్టుకుంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

>
మరిన్ని వార్తలు