విశాఖలో వందలాది మంది వైఎస్సార్‌సీపీలో చేరిక

4 Mar, 2021 05:23 IST|Sakshi
కాశీ విశ్వనాథాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కె.కన్నబాబు

టీడీపీ ఎమ్మెల్యే గంటా అనుచరుడు విశ్వనాథం సహా పలువురు పార్టీలోకి..

ఆహ్వానించిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు 

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర పార్టీల నుంచి వందలాది మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కాశీ విశ్వనాథం సహా వంద మందికి పైగా టీడీపీ నేతలు పార్టీలో చేరారు. వీరికి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె.రాజు కార్యాలయంలో జనసేన, ఇతర పార్టీ నాయకులు 200 మందికి పైగా వైఎస్సార్‌ సీపీలో చేరగా, వీరికి విజయసాయిరెడ్డి కండువాలు వేసి ఆహ్వానించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, కన్నబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో 90 శాతానికి పైగా పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారంటే.. ప్రజలు ఎంతగా వైఎస్‌ జగన్‌ పాలనను స్వాగతిస్తున్నారో అర్థమవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జీవీఎంసీ ఎన్నికల్లోను పునరావృతమవుతాయని.. గ్రేటర్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురుతుందని అన్నారు. కాశీ విశ్వనాథం మాట్లాడుతూ 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగానని, ఎమ్మెల్సీ, వుడా చైర్మన్‌ ఇస్తానని మోసం చేశారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన విధానం నచ్చి వైఎస్సార్‌ సీపీలోకి చేరారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె రాజు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు