హుజూరాబాద్‌ హీట్‌: గెలుపు కోసం ఎవ్వరూ తగ్గట్లే..

13 Aug, 2021 11:28 IST|Sakshi

అభ్యర్థిని ప్రకటించి దూకుడు పెంచిన టీఆర్‌ఎస్‌

మాటల తూటాలు పేలుస్తున్న కమలం, కారు పార్టీలు

బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ కసరత్తు 

దళిత లేదా మహిళా నేతల కోసం అన్వేషణ

కోవిడ్‌ గైడ్‌లైన్స్‌పై పార్టీల అభిప్రాయాలు కోరిన ఈసీ  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం కావడంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ తన దూకుడు పెంచింది. మరోవైపు ఉపఎన్నికకు ముందు ఈసీ తాజాగా ఇచ్చిన సంకేతాలతో మిగిలిన పార్టీలు కూడా కదనరంగంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై తమతమ అభిప్రాయాలు చెప్పాలంటూ అన్ని పార్టీలను ఎన్నికల కమిషన్‌ గురువారం కోరింది.

దీంతో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈటల అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు అయినట్లుగానే ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్‌ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసిందని సమాచారం.

కాంగ్రెస్‌ కసరత్తు
►అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చింది. గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తూ, నియోజవకవర్గంపై వరాల జల్లు ప్రకటిస్తూ.. ప్రత్యర్థి వర్గాలు కూడా చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
►రాజేందర్‌ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. తాను సీఎంకు, ప్రగతి భవన్‌కు బానిసను కాదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే.. తన అభ్యర్థిత్వంపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 
►అదే సమయంలో కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో అసలు ఆ పార్టీ పోటీలోనే లేదని కారు పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. హుజూరాబాద్‌లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలుపెట్టారని సమాచారం. ఈ స్థానం నుంచి స్థానికంగా గట్టి నేతలు అందుబాటులో లేకపోవడంతో బలమైన మహిళ లేదా దళిత నేతలను బరిలో నిలిపే యోచనలో రేవంత్‌ ఉన్నారు.ఇప్పటికే దీనిపై ఆయన పలువురు నేతలను సంప్రదిస్తున్నారు.
►మరో రెండున్నరేళ్లు మాత్రమే ఎమ్మెల్యే పదవీకాలం ఉండటం, ఒకవేళ ఇక్కడ పరాజయం పాలైతే సొంత నియోజకవర్గంలోనూ ఆ ప్రభా వం ఉంటుందన్న ఆందోళనలో కొందరు పోటీ కి సంశయిస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ వారాంతానికి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ నిర్ణయానికి వచ్చే అవకాశముందని సమాచారం.

ఈసీ అభిప్రాయాలు కోరడంతో..!
కోవిడ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించాల్సిన ఉప ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్నికల్లో పాటించాల్సిన కోవిడ్‌ నిబంధనలకు సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆగస్టు 30లోగా పార్టీలు అభిప్రాయాలు తెలపాలని కోరింది. దీంతో ఉప ఎన్నికలు జరగాలి్సన చోట వేడి పెరిగింది. ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన నేపథ్యంలో హుజూరాబాద్‌లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిత్వాలపై త్వరలోనే ఉత్కంఠ వీడనుంది. 

పేలుతున్న మాటల తూటాలు..
ఇంకా నోటిఫికేషన్‌ వెలువడకుండానే.. నియోజకవర్గంలో ఎన్నికల వేడి మాత్రం రాజుకుంది. అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ దూకుడే ఆయుధంగా ముందుకు వెళ్తోంది. బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌ సైతం అదే తరహాలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఆత్మగౌరవం నినాదంతో ఈటల మాటల తూటాలు పేలుస్తుంటే.. అభివృద్ధి బావుటాతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. 

బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమనాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేసి పోటీలో ముందే ఉన్నామని ప్రతిపక్షాలకు సంకేతాలు పంపారు. ఈ ఉప ఎన్నికకు ఇన్‌చార్జీ బాధ్యతలను హరీశ్‌రావు తీసుకున్నారు.  తమకు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను, తమ పార్టీ అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మీ, వృద్ధాప్య పింఛన్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగిస్తున్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందేలా వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు