ఫలించిన కేటీఆర్‌ ప్లాన్‌.. సీనియర్‌ నేతకు టికెట్‌ ఫిక్స్‌

11 Oct, 2023 10:40 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ రిలీజ్‌ అయ్యింది. కాగా, ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, బీఆర్‌ఎస్‌లో సీట్ల పంచాయితీపై ఇంకా కోల్డ్‌వార్‌ నడుస్తూనే ఉంది. టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సందర్భంగా దొరికిన ప్రతీసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. నేతల మధ్య సయోధ్య కుదురుస్తున్నారు. 

ఇందులో భాగంగానే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి మ‌ధ్య కేటీఆర్ స‌యోధ్య కుదిర్చారు. ఇద్దరు నేతలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమై.. వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జనగామ సీటును పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేటాయించడంపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడి యాదగిరిరెడ్డితో చర్చించారు. వీరి మధ్య సయోద్య కుదిర్చి జనగామ స్థానాన్ని పల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ముత్తిరెడ్డికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక, జనగామలో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని గెలిపించాల‌ని స్థానిక నేత‌ల‌కు కేటీఆర్ సూచించారు. ఈ స‌మావేశంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయ‌కులు పాల్గొన్నారు. ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గెలుపున‌కు క‌లిసి ప‌ని చేయాల‌ని ముత్తిరెడ్డి సైతం పిలుపునిచ్చారు.

మరోవైపు.. జనగామ సీటు ఖరారు కావడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేడు కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ఇదే జోష్‌లో ఈనెల 16న కేసీఆర్‌ నేతృత్వంలో జనగామలో భారీ బహిరంగ సభను ప్లాన్‌ చేశారు. ఈ సభ ఏర్పాట్లను నేడు మంత్రి హరీష్‌ రావుతో కలిసి పల్లా పర్యవేక్షించనున్నారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ వైపు.. తండ్రి కొడుకుల చూపు?

మరిన్ని వార్తలు