ఎన్డీయేలో చేరనున్న జితన్‌ రామ్‌ మాంఝీ

2 Sep, 2020 12:34 IST|Sakshi

పట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిందుస్తానీ అవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎమ్‌) చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ అధికార ఎన్డీయే కూటమితో జట్టుకట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 9 స్థానాల్లో పోటీచేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఎన్డీయేలో భాగమైన జేడీయూ కోటా కింద 9 సీట్లు హెచ్‌ఏఎమ్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం విడుదల చేయనున్నట్లు హెచ్‌ఏఎమ్‌ అధికార ప్రతినిధి దానిశ్‌ రిజ్వాన్‌ తెలిపారు. అయితే తాము జేడీయూ తరఫున ఎన్నికల బరిలో నిలుస్తామే తప్ప ఆ పార్టీలో హెచ్‌ఏఎమ్‌ను విలీనం చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామన్నారు. (చదవండి: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టు నో)

అదే విధంగా ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నితీశ్‌జీ తీసుకుంటున్న చర్యలు తమను ఆకర్షించాయని రిజ్వాన్‌ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు సీట్ల కేటాయింపు విషయం పెద్ద సమస్యేమీ కాదని, ఎన్డీయేలో భాగస్వామ్యం కావడం ముఖ్యమన్నారు. కాగా ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమి నుంచి వైదొలిగిన దాదాపు నెల రోజుల తర్వాత జితన్‌ రామ్‌ మాంఝీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక 2015లో జేడీయూను వీడిన జితన్‌ రామ్‌ సొంతంగా హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌ పార్టీ కూటమిలో చేరిన ఆయన ఆగష్టులో మహాఘట్‌బంధన్‌కు గుడ్‌ బై చెప్పారు. మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతుండటంతో.. ‘ఘర్‌ వాపసీ’కి రంగం సిద్ధమైందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. (చదవండి: నితీశే బిహార్‌ సీఎం అభ్యర్థి)

కాగా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ(జనతాదళ్, ఐక్య), ఎల్‌జేపీ(లోక్‌జనశక్తి పార్టీ)లు ఐక్యంగానే బరిలోకి దిగుతాయని, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే సీఎం అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బిహార్‌లో కూడా ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, తామే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు జితన్‌ రామ్‌ మాంఝీతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జేడీయూ మాజీ నేత శరద్ యాదవ్‌ను కూడా తిరిగి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.‌

మరిన్ని వార్తలు