ముస్లింలకు టిక్కెట్ ఇచ్చే ప్రశ్నే లేదు

30 Nov, 2020 20:42 IST|Sakshi

గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప సంచలన వ్యాఖ్యలు

ముస్లింలకు టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదు :కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప

సాక్షి,కర్ణాటక: క‌ర్ణాట‌క బీజేపీ నేత, గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు లోక్‌సభ టికెట్‌ ఇచ్చేప్రశ్నేలేదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర తీశారు. హిందువులలో ఏ వర్గమైనా పర్వాలేదు. ఎవరికైనా ఇస్తాం..కానీ ముస్లింలకు మాత్రం కచ్చితంగా టికెట్‌ ఇవ్వమని మంత్రి  వ్యాఖ్యానించారు.

ఇటీవల కాలంలో బెళగావి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖసహాయ మంత్రి సురేష్‌ అంగడీ కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. త్వరలో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. బెళగావి ఎంపీ టికెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ  ముస్లింలకు కేటాయించే ప్రసక్తిలేదని ఆయన తేల్చి చెప్పారు. బెళగావి హిందూత్వనికి కేంద్రమని ఈ నేపథ్యంలో హిందువేతరులకు, ముఖ‍్యంగా కురుబ, లింగాయత్, వక్కలింగా, బ్రాహ్మణ కులాలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ముస్లింలకు టికెట్‌ ఇచ్చే ప్రశ్న లేదని ఆయన తెగేసి చెప్పారు. గ‌తంలోనూ ఈశ్వ‌ర‌ప్ప ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు