తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా

30 Oct, 2023 20:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, లేఖను చంద్రబాబుకు పంపించానని తెలిపారు.

తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్‌ కోరుతున్నారని.. లోకేష్‌కు 20 సార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ‘‘తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు చెప్పారు. కొన్నేళ్లుగా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన మాట వినగానే ఏం అనాలో నాకు తెలియలేదు’’ అని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేష్ పై కాసాని జ్ఞానేశ్వర్ ఆగ్రహం
‘‘లోకేష్ ఎవరికి దొరకరు. హైదరాబాద్‌లోనే ఉన్నా లోకేష్ పట్టించుకోలేదు. లోకేష్ ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు. పోటీ చేయవద్దని ఎలా చెబుతారు?’’ అంటూ కాసాని మండిపడ్డారు.

‘‘నేను రాకముందే తెలంగాణ టీడీపీ బలంగా లేదు. కార్యకర్తలు మాత్రం పోటీ చేయాలనే బలమైన ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేయడం సరైంది కాదు. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. చిన్నచిన్న పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెడుతున్నాయి’’ అని కాసాని పేర్కొన్నారు.

‘‘లోకేష్‌ దగ్గరకు వెళ్తే కనీసం మాట్లాడలేదు. కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేయాలని ఓ వర్గం వాదన తెచ్చారు. ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలి. కార్యకర్తలకు అన్యాయం చేసి పార్టీలో కొనసాగదలుచుకోలేదు. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసి ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఇంకెందుకు?. గెలిచినా, ఓడినా ఎన్నికల్లో పోటీ చేయాలి. కాంగ్రెస్‌కు మద్దతు. ఇవ్వాలన్న ఒక వాదన వచ్చింది. కొంతమంది కమ్మవారు ఈ ప్రతిపాదన తెచ్చారు. ఏ విషయలోనైనా క్యాడర్‌కు సమాధానం చెప్పాలి కదా?. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా’’ అని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.
చదవండి: తెలంగాణలో టీడీపీ కనుమరుగు

మరిన్ని వార్తలు