Uppal: ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్‌, తగ్గేదేలే! అంటున్న బొంతు రామ్మోహన్‌ ?

12 Dec, 2022 18:40 IST|Sakshi

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌ గులాబీ కోటలో గ్రూపులు బయల్దేరుతున్నాయి. టిక్కెట్లు ఆశించేవారు గళం విప్పుతున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్‌ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడంలేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాలవారీగా విడిపోతున్నారు. గ్రేటర్‌లోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూపుల గురించి చూద్దాం.

గులాబీ ముళ్లు
హైదరాబాద్‌ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు.
(చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత)

రాజకీయాల మధ్య కులం
ఉప్పల్ లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్ గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావిడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట.

ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో... కార్పొరేటర్, మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్ గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్ళుగా భరిస్తున్నానని ఇంక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్తా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది.
(చదవండి: ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్‌ ఏం చేయబోతున్నారు?)

సిట్టింగ్‌ హామీ ఏమవుతుంది?
కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. సిటింగ్‌లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిటింగ్‌లను కాదని వేరేవారికి టిక్కెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి.

దాన్ని దృష్టిలో ఉంచుకునే ఏమో తనకూ బీసీ కోటాలో ఛాన్స్‌ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి.. బండారి లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారని.. బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు