తుమ్మ ముండ్ల తుమ్మల కావాల్నా..పువ్వాడ కావాల్నా: ఖమ్మంలో కేసీఆర్‌

5 Nov, 2023 17:19 IST|Sakshi

సాక్షి, ఖమ్మం:  ఖమ్మంలో తుమ్మముం‍డ్ల తుమ్మల కావాల్నా.. పువ్వుల్లో పెట్టి చూసుకునే పువ్వాడ కావాల్నా తేల్చుకోవాలని అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తుమ్మలకు నేను మంత్రి పదవి ఇస్తే నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చానని  చెప్పుకుంటున్నాడు. ఇంత అరాచకంగా మాట్లాడతారా.. ఎవరు ఎవరికి మంత్రి పదవి ఇచ్చారో మీరే చూశారు.

ఇక ఇంకొక అర్బకుడైతే ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్నాడు. అయనేమైనా ఖమ్మం ప్రజలను కొనేశాడా..ఖమ్మాన్ని గుత్తా పట్టాడా. ఖమ్మానికి పట్టిన ఆ ఇద్దరి పీడను వదిలించాం’ అని కేసీఆర్‌ అన్నారు. ‘ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్‌ కష్టాలు, యాక్సిడెంట్లు. ఇప్పుడు మంచి రోడ్లు, దగ దగలాడే సెంట్రల్‌ లైటింగ్, డ్రైనేజీలు వచ్చాయి. ఒకనాటి లకారం చెరువు అంటే వికారం, ఇప్పుడు లకారం అంటే సుందరమైన చెరువు’అని కేసీఆర్‌ వివరించారు. 

కాంగ్రెస్‌ వల్లే సింగరేణిలో వాటా కేంద్రానికి పోయింది..

 ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ వల్లే సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి వెళ్లిందని విమర్శించారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధం అని చెప్పారు. 

ఎన్నికల్లో అభ్యర్థి వెనుక ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీ వైఖరి, చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు. కాంగ్రెస్‌ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల బాట పట్టిందన్నారు. సింగరేణి తెలంగాణ ఆస్తి అని చెప్పారు.  సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగూడెం జిల్లాకు కరువనేదే రాదన్నారు. 

వనమా వెంకటేశ్వర్‌రావు ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా వ్యక్తిగత పనులు అడగలేదని కేసీఆర్‌ చెప్పారు. కొత్తగూడెం అభివృద్ధి గురించి మాత్రమే అడిగారని తెలిపారు. వనమాను చూసి కాకుండా కేసీఆర్‌ను చూసి వనమాకు ఓటు వేయండని కోరారు.


 

మరిన్ని వార్తలు