కేసీఆర్‌ ఫాంహౌస్‌ సినిమా అట్టర్‌ఫ్లాప్‌ 

28 Dec, 2022 02:55 IST|Sakshi

‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీపై బురద జల్లేందుకు కల్వకుంట్ల కుటుంబం కుటిల యత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు కథ,   స్క్రీన్‌–ప్లే, దర్శకత్వం, నిర్మాతగా అన్నీ తానై సీఎం కేసీఆర్‌ తీసిన ‘ఫాంహౌస్‌ ఫైల్స్‌’ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్‌ పసలేని విమర్శలు చేస్తోందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ డబ్బు ఎర వేస్తూ పోలీసులకు పట్టుబడిందంటూ సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి వీడియోలు ప్రదర్శించారని... కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉండగానే ఆ వివరాలు సీఎంకు ఎలా చేరాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 

ఎమ్మెల్యేల ఫోన్లు రికవరీ చేయలేదేం? 
రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఏర్పడేలా కేసీఆర్‌ ‘సిట్‌’ ఏర్పాటు చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లను, వాటిలోని డేటాను కేసీఆర్‌ ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నించారు. ‘ఈ కేసు విచారణ సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ఆయా ఎమ్మెల్యేలకు, కేసీఆర్‌ కొత్త సినిమా దర్శకత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

రాష్ట్రానికి త్వరలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. 
తాను భద్రాచలం, రామప్ప అభివృద్ధికి నిధులు తెచ్చానని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘తెలంగాణకు త్వరలోనే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తుంది. ప్రస్తుతం ట్రాక్‌ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు నడపాలని నిర్ణయించాం’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.   

మరిన్ని వార్తలు