తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం

11 Oct, 2022 00:42 IST|Sakshi
బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. చిత్రంలో సంజయ్, కిషన్‌రెడ్డి

లేదంటే మీరు రాజీనామా చేయండి

టీఆర్‌ఎస్‌ నేతలకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్‌

భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్‌ దాఖలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్‌ఎస్‌ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. నిబంధనల ప్రకారం, పారదర్శకంగా తన కంపెనీకి జాతీయ స్థాయి లో ఓ కాంట్రాక్టు టెండర్‌ లభిస్తే టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం కాంట్రాక్టు పొందేందుకే బీజేపీలో చేరినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. తాను యాదాద్రి ఆలయం గర్భగుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని, టీఆర్‌ఎస్‌ నేతలు కూడా అక్కడకు రావాలన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై న్యాయపోరాటం సైతం చేస్తా నని హెచ్చరించారు.

మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి సోమవారం చండూరులో నామినేషన్‌ దాఖలు చేశారు. బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించి రిటర్నింగ్‌ అధికారికి 3 సెట్ల నామినేషన్లు సమర్పించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాస్వా మ్యా న్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్‌ను బొంద బెట్టే సమ యం వచ్చిందన్నారు. ఫాంహౌస్‌కు, ప్రగతి భవన్‌ కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పే ధర్మయుద్ధంలో ఓటర్లు కలసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిషత్తు తరాల బాగు కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు.  

మరిన్ని వార్తలు