ప్రవల్లిక విషయంలో చిల్లర రాజకీయాలొద్దు: కేటీఆర్‌ ఫైర్‌

18 Oct, 2023 13:46 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలో కరీంనగర్‌లో ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మంత్రి కేటీఆర్‌ సహా గంగుల కమలాకర్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీలు రమణ, భాను ప్రసాదరావు, ప్లానింగ్‌ బోర్డు వైఎస్‌ ఛైర్మన్‌, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. ప్రవల్లిక విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రవల్లిక తల్లిదండ్రులు ఈరోజు నన్ను కలిశారు. ఒకడు మా అమ్మాయిని వేధించి చంపాడని చెప్పారు. న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చాను.ప్రవల్లిక సోదరుడికి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పాను. ఆ కుటుంబానికి అండగా ఉంటాం.

టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఉద్యోగాలు కోరుకుంటున్నవాళ్లకు న్యాయం చేస్తాం.  త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. రాహుల్‌, ప్రియాంక గాంధీ వంటి వారు వచ్చి మాయమాటలు చెబుతారు జాగ్రత్త అని అన్నారు. 

ఇదే సమయంలో అద్భుతమైన మెజారిటీతో మళ్లీ ఎమ్మెల్యే కాబోయే గంగుల కమలాకర్‌కు అభినందనలు. ఒక్క గంగులకే కాదు ఎంపీ ఎన్నికల్లో వినోద్‌ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి. గత ఎన్నికల్లో మోసం జరిగింది. ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ కరీంనగర్‌ కోసం ఏం చేశాడు. బడి లేదు.. గుడి లేదు ఏమీ తేలేదు. ప్రధాని మోదీ ఎందుకు దేవుడో బండి సంజయ్‌ చెప్పాలి. మోదీ చెప్పినట్టు రూ.15లక్షలు వచ్చినవాళ్లంతా బీజేపీకి ఓటు వేయండిన. రానివాళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. కేసీఆర్‌ అందరివాడు.. ఏ ఒక్క మతానికో లేక వర్గానికో చెందిన వ్యక్తి కాదు. 

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఓ క్రిమినల్‌. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన వ్యక్తి. ఓటు విషయంలో ఆలోచించి వేయండి. తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది కరీంనగర్‌లోనే. ఓటుతో బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాలి. మతం పేరుతో చిచ్చు పెట్టే కొందరు వ్యక్తులు మళ్లీ కరీంనగర్‌ వచ్చారు. వారితో జాగ్రత్త అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా రెడీ.. విడుదల ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు