వైఎస్సార్‌సీపీలోకి కుప్పం టీడీపీ నేతలు

3 Oct, 2022 06:10 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 50 కుటుంబాలు 

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయం

తిరుపతి మంగళం: వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల కుప్పం వచ్చి వెళ్లాక నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు తండోపతండాలుగా వస్తున్నారని తెలిపారు.

ఆదివారం తిరుపతిలోని మంత్రి కార్యాలయంలో కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లే మండలం కొడతనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 50 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరామని టీడీపీ నాయకులు తెలిపారు. గత 30 ఏళ్లుగా టీడీపీ జెండా మోశామని, అయినా ఏనాడూ ఇన్ని సంక్షేమ పథకాలు పొందలేదని వివరించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాకే కుప్పం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా మరో 30 ఏళ్లకు కూడా కుప్పంలో ఇంత అభివృద్ధి జరగదన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌తోనే కుప్పం ప్రజలు నడుస్తారని చెప్పారు. ఇన్నేళ్లు కళ్లు మూసుకుపోయి టీడీపీకి పని చేశామని, చేసిన తప్పులు తెలుసుకున్నామని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో వరుసగా టీడీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు.

మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడంతో చంద్రబాబు కంచుకోట బద్దలయిందని చెప్పారు. కుప్పంలో భరత్‌ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.  కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు చంద్రబాబు  సీఎంగా ఉన్నా కుప్పం అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.  

పేర్నాటి విజయానికి కృషి చేయాలి: పెద్దిరెడ్డి
వైఎస్సార్‌సీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైఎస్సార్‌సీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పేరును ప్రకటించారు. అనుకున్న సమయానికి ఓటర్ల నమోదు పూర్తి చేయాలని చెప్పారు. ఓటర్‌ కార్డ్‌కు ఆధార్‌ని అనుసంధానం ద్వారా దొంగ ఓట్లకు చెక్‌ పెట్టవచ్చని చెప్పారు. కుప్పంలో దొంగ ఓట్లు తొలగించడానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ భరత్‌కు సూచించారు.  

డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు మిథున్‌ రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, ఆదిమూలం, అరణి శ్రీనివా సులు, వరప్రసాద్, ఎంఎస్‌.బాబు, డిప్యూటీ మేయర్‌ భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు