దిగిపోక తప్పదు!

23 Jul, 2021 05:27 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న యడియూరప్ప

సంకేతాలిచ్చిన కర్ణాటక సీఎం యడియూరప్ప

తన భవిష్యత్తును 25న బీజేపీ నాయకత్వం తేలుస్తుందని వెల్లడి

బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి నుంచి తాను దిగిపోవడం తప్పదన్న సంకేతాలను కర్ణాటక సీఎం బి.ఎస్‌.యడియూరప్ప(78) ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పుపై ఆయన తొలిసారిగా గురువారం నోరు విప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వ నిర్ణయమే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును ఈ నెల 25వ తేదీన బీజేపీ నాయకత్వం ఖరారు చేయనుందని పేర్కొన్నారు. పార్టీ పెద్దల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని ఈ నెల 26న పూర్తి చేసుకోనున్నారు. ఇతరులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని గతంలో అధిష్టానానికి చెప్పానన్నారు.

మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నాపై ప్రత్యేకమైన ప్రేమ, విశ్వాసం ఉన్నాయి’ అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేసి, మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తలెవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని, అందరూ తనకు సహకరించాలని కోరారు. అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. తనకు అనుకూలంగా ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని చెప్పారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు.

వెల్లువెత్తుతున్న సంఘీభావం
సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పదని యడియూరప్ప చెబుతుండగా, మరోవైపు ఆయనకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. మఠాలు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు ఆయనకు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వీరశైవ–లింగాయత్‌ సామాజికవర్గం నేతలు యడియూరప్పకు అండగా నిలుస్తున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అఖిల భారత వీరశైవ మహాసభ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆయనను పదవి నుంచి తప్పిస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

>
మరిన్ని వార్తలు