Sakshi News home page

నానమ్మ ఇందిరపై వరుణ్‌ గాంధీ ప్రశంసలు.. కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎంపీ?

Published Fri, Dec 22 2023 7:29 PM

BJP MP Varun Gandhi Praises Indira Gandhi For 1971 war Victory - Sakshi

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 భారత్‌-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ.. నిజమైన నాయకులు గెలుపు వల్ల లభించిన పేరు ప్రతిష్టలను తన  తన ఖాతాలోనే వేసుకోరని అన్నారు. ఈ మేరకు 1971 యుద్ధంలో భారత్‌ చారిత్రాత్మక విజయం తర్వాత  అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్‌ మానెక్‌షాకు ఇందిరా రాసిన లేఖను వరుణ్‌ గాంధీ షేర్ చేశారు.

‘మొత్తం జట్టు కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం లభిస్తుందని నిజమైన నాయకుడికి తెలుసు. విజయంతో వచ్చిన కీర్తి ప్రతిష్టలను వారు ఒక్కరే స్వీకరించరు. ఎప్పుడూ ఎలా విశాల హృదయంతో ఉండాలో ఆ నేతకు తెలుసు’ అని వరుణ్‌ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారి తీసిన విజయం గురించి గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు భారతదేశం మొత్తం ఈ ఇద్దర్ని జాతీయసంపదగా భావిస్తోందని, వారికి వందనం చేస్తుందని అన్నారు.

కాగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్‌ గాంధీ.. ఈమధ్య పార్టీ విషయాల్లో అంటీముట్టనట్లు వ్యహరిస్తున్నారు. కీలక విషయాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతకాలంగా తన లోక్‌సభ నియోజకవర్గమైన పిలిభిత్‌లో క్రియాశీలంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి.

వీటిని బలపరిచేలా గత నెలలో ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ పుణ్యక్షేత్ర సందర్శనకు వేర్వేరుగా వెళ్లిన  రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ.. ఆలయం బయట కలుకొని అప్యాయంగా పలకరించుకున్నారు. అయితే  ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరు నేతలు చెప్పుకొచ్చారు. తాజా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.
చదవండి: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు

Advertisement

What’s your opinion

Advertisement