బీజేపీ, టీఎంసీలను ఓడించాలి

1 Mar, 2021 02:24 IST|Sakshi
కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సభకు భారీగా హాజరైన జనం

కోల్‌కతాలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్‌ఎఫ్‌ భారీ ర్యాలీ

కోల్‌కతా: లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌) సంయుక్తంగా ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. మతతత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజలకు జనహిత సర్కారును అందిస్తామని హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి, ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నాయి. ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీల మధ్య పోటీ మాత్రమే కాదని, మూడో పక్షంగా తమ కూటమి కూడా బరిలో ఉందని కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ చౌధురి పేర్కొన్నారు. బీజేపీ, టీఎంసీలను ఓడించి తీరుతామన్నారు. మరోవైపు, ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఎన్నికల తరువాత టీఎంసీ జీరో అవుతుందని ఐఎస్‌ఎఫ్‌ చీఫ్‌ అబ్బాస్‌ సిద్దిఖీ వ్యాఖ్యానించారు.

కూటమిలో సీట్ల పంపకాలను ఉద్దేశిస్తూ.. ఐఎస్‌ఎఫ్‌ న్యాయబద్ధ వాటా సాధిస్తుందని కాంగ్రెస్, వామపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు. ‘బీజేపీ, టీఎంసీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. మతపరంగా ప్రజలను విడదీయడమే వాటి లక్ష్యం. ప్రజలకు అభివృద్ధిదాయక పాలన మా కూటమే అందివ్వగలదు’ అని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి సూర్యకాంత మిశ్రా పేర్కొన్నారు. హంగ్‌ అసెంబ్లీ వస్తే టీఎంసీ బీజేపీతో చేతులు కలిపి ఎన్‌డీఏలో చేరేందుకు కూడా వెనుకాడరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఎన్‌డీఏలో గతంలోనూ టీఎంసీ భాగస్వామిగా ఉందన్న విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు.  బీజేపీ, టీఎంసీల మధ్య ప్రస్తుతం జరిగేది ఉత్తుత్తి యుద్ధమేనన్నారు.
 

మరిన్ని వార్తలు