ఆ నలుగురు శ్వేత పత్రం విడుదల చేయాలి: ఎర్రబెల్లి

16 Nov, 2020 18:22 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: దుబ్బాకలో తప్పుడు ప్రచారాలు చేసి.. ఓ కార్యకర్తను బలిచేసి.. ప్రజలను మోసం చేసి గెలిచారు. బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో సాక్షాలతో చూపండి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సవాల్‌ చేశారు. హన్మకొండలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి. వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అయినా పట్టించు కోలేదు. పేదల సంక్షేమంలో మీ పాత్ర ఏంటి? మిషన్ భగీరథకు కేంద్రం 10 అవార్డులు ఇచ్చి ప్రశంసించింది. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. హైదరాబాద్ నగరం వరదలకు కొట్టుకుపోతే ఆదుకోవాలనే సోయి లేదు అని మండిపడ్డారు ఎర్రబెల్లి. (చదవండి: ‘కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు)

ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతలు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు. బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్... దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తున్నారా.. ఇస్తే రుజువు చేయాలి. తెలంగాణ రైతులకు మీ మోసాలపై అవగాహన కల్పిస్తాం. త్వరలో రైతులు బీజేపీ నేతలను తరిమికొడతారు. బీజేపీ నేతలవన్నీ బోగస్ మాటలు. కార్పోరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారి రైల్వేను ప్రయివేటీకరణ చేసిన చరిత్ర బీజేపీది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు తెలంగాణ ప్రజలు- రైతులు సిద్ధం కావాలి. బీజేపీ నేతలు సిగ్గులేకుండా రైతుల పట్ల కపట నాటకాలు ప్రదర్శిస్తున్నారు’ అని మండిపడ్డారు ఎర్రబెల్లి.

మరిన్ని వార్తలు