అప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా? బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్‌

28 May, 2022 21:27 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.  బాలకృష్ణను చూస్తే బాధకరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా?.. ఇప్పుడు నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహం పెడుతానంటున్నారని విమర్శించారు. నిమ్మకూరులో ఎన్‌టీఆర్ విగ్రహం పెట్టి అభివృద్ధి చేస్తామని..సీఎం జగన్‌, కొడాలి నాని ముందే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్క్రిప్ట్‌లు మానేసి.. ఎన్టీఆర్‌ కొడుకుగా ఒక డైనమిక్‌ లీడర్‌గా ముందుకొచ్చి టీడీపీ కార్యకర్తలను కాపాడండని అన్నారు.

ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా శనివారం మాట్లాడుతూ.. ‘తండ్రికి తగ్గ తనయుడిగా ఉండి ఉంటే, ఎన్టీఆర్‌గారు చనిపోయినప్పుడు బాలకృష్ణగారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల అమాయకత్వాన్ని వాడుకుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, వాళ్లను ఏ విధంగా బయటపడేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరంగా ఉంచిన చంద్రబాబు, మళ్లీ తన అధికారం కోసం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవడం కూడా చూశాం.

చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని నిమ్మకూరు అభివృద్ధి, ఈరోజు బాలకృష్ణ అక్కడకు వెళ్ళి,  ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుతామని, ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్టామని  చెప్పడం అమాయకమా? మరొకటా అనేది అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా బాలకృష్ణగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ గారి విగ్రహం పెట్టాలని ఎందుకు గుర్తుకు రాలేదు. ఎన్టీఆర్‌ను గౌరవిస్తామని సీఎం జగన్‌ ప్రతి సమావేశంలోనూ చెప్పేవారు. అందుకు నిదర్శనంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టడం జరిగింది. అందుకు ముందుగా ఎన్టీఆర్‌ కుటుంబం వైఎస్‌ జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి’ అని మంత్రి రోజా అన్నారు.
చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు.. నరసరావుపేట సభలో మంత్రులు

మరిన్ని వార్తలు