24 గంటల కరెంటు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా

30 Sep, 2023 02:44 IST|Sakshi

ఎన్నికల్లో కూడా పోటీ చేయను మంత్రులు కేటీఆర్, హరీశ్‌లకు ఇదే సవాల్‌

కర్ణాటక పథకాల అమలును చూడాలనుకుంటే మంత్రివర్గం మొత్తాన్ని తీసుకెళతాం

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌ మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడని, ఆయన హామీ నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే ఎండిపోతున్నాయని టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి 14 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదన్నారు.

మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తాను సవాల్‌ విసురుతున్నానని, ఏ సబ్‌స్టేషన్‌ వద్దకు రమ్మంటారో చెపితే వస్తానని, అక్కడ 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

అధికారంలో ఉండే ఈ నెలరోజుల పాటైనా రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని స్కీములు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ కాంగ్రెస్‌ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు వస్తానంటే ప్రత్యేక విమానం పెట్టి తీసుకెళ్తామని, మంత్రివర్గం వచి్చనా ఫర్వాలేదన్నారు. పథకాల అమలును వివరించేందుకు సీఎం కేసీఆర్‌ రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహా్వ నించాలని కోరుతానని చెప్పారు. 

తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్‌లోకే రూ.60 కోట్లు 
దళిత బంధు పథకానికి సంబంధించిన ఒక్క తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్‌లోకే రూ. 60 కోట్లు వెళ్లాయని కోమటిరెడ్డి ఆరోపించారు. దళితబంధులో బీఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్న సొమ్ముతోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. అధికారంలోకి వచి్చన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తామనీ, అమలు చేయలేకపోతే దిగిపోతామన్నారు. 

బాబు అరెస్టు ఎపిసోడ్‌ ఫాలో కావడం లేదు 
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్‌ను తాను ఫాలో కావడం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యా నించారు. టీవీ చూస్తున్నప్పుడు ఆ వార్తలు వస్తు న్నా చానల్‌ మారుస్తున్నానని, తమ బాధలు తమకున్నాయని, తెలంగాణలో అధికారం దక్కించుకోవడమెలా అనే దానిపైనే దృష్టి పెట్టినట్లు చెప్పా రు. తాను 30 స్థానాల్లో గెలిపించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి 80 సీట్లు ఎలా తీసుకురావాలన్న దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లోకి చేరికలపై మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట మాట్లాడబోనని, వచ్చే నెల 1న ఢిల్లీలో జరిగే సమావేశంలోనే అన్ని విషయాలను మాట్లాడుతానని వెల్లడించారు.

మరిన్ని వార్తలు