శాంతించిన సిద్ధూ..!

1 Oct, 2021 04:31 IST|Sakshi

పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకారం

కీలక నిర్ణయాల కోసం సమన్వయ కమిటీ

న్యూఢిల్లీ/చండీగఢ్‌:  పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన గురువారం చండీగఢ్‌లోని పంజాబ్‌ భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో భేటీ అయ్యారు. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్‌ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

అలాగే ఒక సమన్వయ కమిటీని(కో–ఆరి్డనేషన్‌ ప్యానెల్‌) ఏర్పాటు చేసుకోవాలని ఇరువురూ నిర్ణయానికొచి్చనట్లు తెలిసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు నేతల మధ్య 2 గంటలపాటు భేటీ జరిగింది. భేటీ తర్వాత చన్నీ, సిద్ధూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

అతిత్వరలో సీడబ్ల్యూసీ సమావేశం
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం అతిత్వరలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా గురువారం చెప్పారు. పార్టీలో ఇటీవలి కాలంలో లుకలుకలు, అసంతృప్త గళాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సీడబ్ల్యూసీ భేటీ తక్షణమే నిర్వహించాలని సీనియర్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంపై అధినేత సోనియా గాంధీ ఇటీవలే సంకేతాలిచ్చారని రణదీప్‌ సూర్జేవాలా చెప్పారు. సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మరోవైపు, పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అస్థిరత సృష్టిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ గురువారం ఆరోపించారు.

మరిన్ని వార్తలు