బాబు సమర్థుడు

15 Mar, 2023 04:46 IST|Sakshi

ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టేలా మా ప్రణాళిక

జనసేన వార్షికోత్సవ సభలో పొత్తులపై పవన్‌కళ్యాణ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీ ఏదైతే జరగకూడదనుకుంటుందో అదే జరుగుతుంది

తెలంగాణలో పోటీ చేస్తానంటే బీజేపీ నేతలు ఆంధ్రా వాడివన్నారు 

సాక్షి, అమరావతి: ‘జనసేన పార్టీ దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఒకటి జరగకూడదని కోరు­కుంటోంది. కానీ అదే జరుగుతుంది. ఈ­సారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబో­దు.ఈ ఎన్నికల్లో మా ఓటును వృథా కాని­వ్వం. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టేలా మా ప్రణాళిక ఉంటుంది. పవన్‌కళ్యాణ్‌తో సహా నిలబడ్డవారందరూ గెలిచే తీరాలి. జనసేన సత్తా చాటుతాం’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ పొత్తులపై స్పష్టత ఇచ్చారు.

జనసేన పార్టీ పదవ వార్షికోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాలా లేదా.. అన్న దానిపై ఇంత వరకు మాట్లాడలేదు. మీకు చెతులెత్తి మొక్కుతున్నా. నమ్మండి’ అని వాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబు అంటే తనకు గౌరవం ఉందని, ముఖ్యమంత్రిగా ఆయన సమర్థుడు అంటూ కొనియాడారు. ఈ సభలో పవన్‌ ఇంకా ఏమన్నారంటే..

వైసీపీ తొడలు బద్దలు కొడతాం..
► మీరు పెట్టరు, నన్ను తిననివ్వరు. తెలంగాణలో పోటీ చేస్తానంటే కొంత మంది బీజేపీ నాయకులు నువ్వు ఆంధ్రావాడివి అనడం బాధేసింది. ఆంధ్రా వాళ్ల ఓటు కావాలి కానీ, ఆంధ్రవాళ్లు పోటీ చేయకూడదంటే ఎలా? 

► నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అనుకున్న ప్లాన్‌ అమలు చేసి ఉంటే ఇప్పుడు తెలుగుదేశం అవసరం లేని స్థాయికి ఎదిగే వాళ్లం. రాష్ట్రంలో లాంగ్‌ మార్చ్‌ పెట్టుకుందామంటే ఆ పార్టీ నేతలు ఢిల్లీలో ఒప్పకొని, తీరా రాష్ట్రానికి వచ్చి వద్దన్నారు.

► ఒంటరిగా పోటీ చేసినా కూడా జనసేన గెలుస్తుందని నాకు సంపూర్ణ నమ్మకం వచ్చినప్పుడు అలానే పోటీ చేయడానికి వెనుకాడం. అయితే, అది ఎంత వరకు సాధ్యమన్నది నేను రాష్ట్రమంతటా తిరిగాక తెలుస్తుంది. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యండని వైసీపీ నేతలు మదం ఎక్కి తోడలు కొడుతున్నారు.. వారి రెండు తొడలు బద్దలు కొడతాం. 

ఇంకా కోపం రాకపోతే ఎలా?
► “రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతుంటే, ఇంకా మీకు కోపం రాకపోతే ఎలా? ఎంత కాలం మా కులం, మా వాడని వదిలేస్తారు.. అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారు, డిగ్రీ చేసిన వారు కూడా ఓటును అమ్ముకుంటే మార్పు ఎప్పుడు వస్తుంది?  

► చాలా మంది పార్టీ పెట్టి ఏడాది.. రెండు మూడేళ్లలో వదిలేశారు. అలాంటిది రెండు చోట్ల ఓడిపోయి కూడా తాను పదేళ్లుగా రోడ్లపై తిరుగుతున్నా. ఒక రోజు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. కాపులు ఎవరూ మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు అని అనుకుంటున్నారుగా.. మీరు ఓటేయండి, నేను సీఎం అయి చూపిస్తా.

► రాష్ట్రంలో ఒక కులం పెత్తనం ఆగిపోవాలి. అన్ని పదవులు ఒక సామాజిక వర్గం వారికి ఇస్తే మిగతా కులాల వారు ఏమనుకోవాలి? తెలంగాణ సీఎం నాకు రూ.వెయ్యి కోట్లు ఆఫర్‌ చేశారంట. ఆ వెయ్యి కోట్లు ఎక్కడ ఉన్నాయని వెతుకుంటున్నా. అంతకు ముందు ప్యాకేజీ తీసుకున్నారన్నారు. అప్పుడే చెప్పు చూపించా. ఇంకొకసారి పిచ్చిపిచ్చిగా వాగితే గట్టి దెబ్బ పడుద్ది.

మరిన్ని వార్తలు