బాబు డ్రామాలను ప్రజలు నమ్మరు

2 Mar, 2021 03:35 IST|Sakshi

రాజకీయ లబ్ధి కోసం దిగజారుడుతనం 

నిబంధనలకు విరుద్ధమని తెలిసే పర్యటన 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు వైఖరి 

నాడు జగన్‌ను దారుణంగా రన్‌వేపై కూర్చోబెట్టారు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి తుడా: తన ఉనికిని చాటుకుని రాజకీయంగా లబ్ధిపొందేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చిత్తూరు, తిరుపతి పర్యటన ఎన్నికల, కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. ప్రభుత్వంపై అభాండాలు వేసేందుకే వచ్చారన్నారు. చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారన్నారు. ప్రతిపక్షనేత అయిన చంద్రబాబుకు పోలీసులు తగిన గౌరవం ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన, నిరసన కార్యక్రమాలు నిబంధనలకు విరుద్ధమని పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చినా వాటిని లెక్కచేయకపోవడం సరికాదన్నారు. ఓ వర్గం మీడియాలో వార్తల కోసమే చంద్రబాబు ఎయిర్‌పోర్టులో పోలీసులకు సహకరించకుండా నానా యాగీ చేశారని విమర్శించారు. ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. పిల్లనిచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని చెప్పారు.

2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోనే వెబ్‌సైట్‌లోనే లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు కూడా టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. బాబు చరిత్ర తెలిసి ప్రజలు చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయారని, ఇన్నాళ్లకు ఆయన మోసాలను గుర్తించిన కుప్పం ప్రజలు తిరగబడి పంచాయతీ ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు మతి భ్రమించి వ్యవహరిస్తున్నారన్నారు. తాను ముందే చెప్పినట్లు పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా ప్రజలు ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 80 శాతానికిపైగా స్థానాలు వైఎస్సార్‌సీపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థంగా, సమన్వయంతో పాలన సాగిస్తుంటే చంద్రబాబు ఏ విధంగా అడ్డుకోవాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్నారని, వారు ఎన్నికల కోసం పనిచేయడం లేదని గుర్తించాలని చెప్పారు.  

నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దారుణంగా అడ్డుకున్నారు 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అత్యంత దారుణంగా విశాఖ విమానాశ్రయంలో అడ్డుకుని రన్‌వేపై కూర్చోబెట్టిన విషయాన్ని ప్రజలు నేటికీ మరిచిపోలేదని చెప్పారు. ఎన్నికలు, కోవిడ్‌ వంటి నిబంధనలు వంటివి లేకున్నా ఆయన్ని విమానాశ్రయంలోంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. తన రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు జిల్లాలో పర్యటించడాన్ని పోలీసులు వద్దని వారిస్తే వారిపై తిరగబడుతున్నారన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు ప్రతిపక్షనేతకు తగిన గౌరవాన్ని ఇచ్చి వెనుతిరగాలని వేడుకున్నా సహకరించకపోవడం మంచిదికాదని చెప్పారు. శాంతి భద్రతలు, తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తిరిగి ప్రయాణం అయి ఉంటే బాగుండేదన్నారు. మార్చి 31 తరువాత చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌ ఫోన్‌ను కూడా లిఫ్ట్‌ చేసే పరిస్థితి ఉండదని, వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు