ఆ రెండు భారతదేశానికి రాహు-కేతువులు! అమిత్‌ షా ఫైర్‌

22 Nov, 2023 16:03 IST|Sakshi

రాజస్తాన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్‌ షా బహిరంగ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం జరిగిన ఈ బహిరంగ ర్యాలీ అమిత్‌ షా మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబం భారతదేశాన్ని పట్టి పీడుస్తున్న రాహు-‍కేతువులని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో భారతదేశానికి తలెత్తే కష్టాలన్నింటికీ గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ల వల్లనే వస్తుందని విమర్శలు గుప్పించారు. భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మోదీ.. తాను చెప్పినట్లుగానే చంద్రయాన్‌తో భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రునిపై రెపరెపలాడేలా చేశారు. అంతేగాక జీ 20 ఆతిథ్యంతో భారత దౌత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు.

అలాగే కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాన మోదీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి రూ. 6 వేలుగా ఉన్నదాన్ని కాస్తా రూ. 12 వేలు చేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మిల్లెట్‌ను ఎంఎస్‌పీకి కొనుగోలు చేస్తోంది. ఇక గ్యాస్‌ సిలిండర్‌లను తమ పార్టీ కేవలం రూ. 450/- లకే అందిచింది. ఇలా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ఇదిలా ఉండగా అంతకు మునుపు రాజస్తాన్‌లోని నసీరాబాద్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ..రాహుల్‌ గాంధీ పదేపదే ఓబీసీ వర్గాల గురించి మాట్లాడుతున్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రు దగ్గర నుంచి రాహుల్‌ గాంధీ వరకు సుమారు నాలుగు తరాలు గాంధీలు  ఓబీసీ వర్గాల అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపణలు చేశారు.

కానీ బీజేపీ జాతీయ వెనుకబడిని తరగతుల కమిషన్‌(ఎన్‌సీబీసీ)ని రాజ్యాంగబద్ధంగా మార్చింది. అలాగే తొలి ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చిన ఘనత కూడా మాదే. ఇలాంటివి కాంగ్రెస్‌ ఎన్నడూ చేయలేదు. పైగా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. ఇదే సమయంలో రాజస్తాన్‌ ముఖ్యమంతి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరిగారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంత అవినీతి మయ ప్రభుత్వాని చూడలేదంటూ చిరాకుపడ్డారు. ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అవినీతి పరులందరికీ శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పేపర్‌ లీక్‌లు జరగకుండా చూడటమే కాకుండా సుమారు 2.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.

అంతేగాదు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. 2004-14 మధ్య కాలంలో రాజస్తాన్‌కి కేవలం రెండు లక్షల కోట్ల రూపాయాలు తగ్గించి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ మోదీ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌కు తొమ్మిదేళ్లలో దాదాపు 6 లక్షల డభైవేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిసాన్‌ సమ్మాన్‌ కింద రైతులకు రూ. 12 వేలు వరకు ఇవ్వడమే గాక వైద్య ఖర్చులు దాదాపు 10 లక్షల వరకు భరిస్తామని చెప్పుకొచ్చారు అమిత్‌ షా. కాగా, రాజస్తాన్‌లో ఈ నెల 25న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌లో ఈసారి 199 స్థానాల్లోనే ఎన్నికలు జరగనుండటం గమనార్హం. 

(చదవండి: నో డౌట్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం)

మరిన్ని వార్తలు