టీడీపీలో సీటు కోసం నానాపాట్లు.. సీనియర్‌ నేతకు సర్దుబాటు అవుతుందా?

8 Jun, 2023 20:32 IST|Sakshi

ఆయన కర్నూల్ జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయనేమో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను పాతాళంలో పాతేయడంతో చేసేది లేక పచ్చ పార్టీలో చేరారు. టీడీపీలో ఆయన సీనియారిటీకి గౌరవం ఇవ్వడంలేదట. అసలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కూడా ఆ సీనియర్ నాయకుడు నానాపాట్లు పడుతున్నారని టాక్ నడుస్తోంది. 

ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడిగా, కేంద్ర మంత్రిగా కోట్ల సూర్యప్రకాశరెడ్డికి పరిచయం అక్కర్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో సూర్యప్రకాశరెడ్డి అనివార్యంగా తెలుగుదేశంలో చేరారు. పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో చంద్రబాబు కోట్లకు ఎన్నో హామీలిచ్చారు. కోట్ల వంటి సీనియర్లు పార్టీకి అవసరం అని చెప్పారు. అప్పుడు కోట్ల అడిగిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేశారు. కానీ ఇప్పుడేమో కోట్ల కుటుంబాన్ని అసలు పట్టించుకోకుండా దూరంగా ఉంచుతున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే ఇస్తామని..అది కూడా అన్నీ అనుకూలిస్తేనే అని మెలిక పెడుతున్నారు. అయితే, కోట్ల సూర్యప్రకాశరెడ్డి మాత్రం తనకు ఎమ్మిగనూరు సీటు ఇవ్వాల్సిందే అని పట్టుపడుతున్నారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ప్రస్తుతం బి.వి జయనాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి తన వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది తెలుసుకున్న జయనాగేశ్వరరెడ్డి టీడీపీ అధిష్టానానికి కోట్లపై ఫిర్యాదు చేసారు. అప్పటికి ఏదో సర్దుబాటు అయ్యింది కాని కోట్ల మాత్రం ఎమ్మిగనూరు సీటు కోసమే రాజకీయం చేస్తున్నారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఓడిపోయాక నియోజకవర్గానికి దూరంగా ఉండటం, కార్యకర్తల్ని పట్టించుకోకపోవడంతో మొత్తంగా తెలుగుదేశం పార్టీయే ఆయనకు దూరంగా జరిగింది. ఈ పరిస్థితుల్నే ఆసరాగా తీసుకుని కోట్ల సూర్యప్రకాశరెడ్డి అక్కడ కుంపటి పెట్టారు. కోట్ల ఎంట్రీ ఇచ్చాక జయనాగేశ్వరరెడ్డి నా సీటు అంటూ హడావుడి చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో టీడీపీ కేడర్‌కు ఇబ్బందిగా మారింది. నారా లోకేష్ పాదయాత్రలోనూ రెండు వర్గాలు ఆధిపత్య ధోరణి కొనసాగించాయి. ఎన్నికలకు ఏడాది ముందే ఇలా ఉంటే.. టిక్కెట్లు ప్రకటించేనాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
 
గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. చంద్రబాబు కోరిన టిక్కట్ ఇస్తారో లేదో తెలియదు.. అసలు టిక్కెట్ ఇస్తారో ఇవ్వరో కూడా అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇది కూడా చదవండి: TS: సైలెంట్‌ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే?

మరిన్ని వార్తలు