పంజాబ్‌లో విజయం మాదే.. ఇదిగో సిగ్నల్‌!

18 Jan, 2022 19:49 IST|Sakshi

ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ విశ్వాసం

సీఎం అభ్యర్ధిగా భగవంత్ మాన్ ఖరారు

ఆయనే తదుపరి సీఎం అవుతారని జోస్యం

మొహాలి: పంజాబ్‌లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) దూకుడు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న ‘ఆప్‌’ ఈసారి ఎన్నికల్లో ఫస్ట్‌ ప్లేస్‌ సాధించాలని పట్టుదలతో ఉంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించి ఎన్నికల ప్రచార పర్వంలో ముందంజలో నిలిచింది. తాము సీఎం అభ్యర్థిగా ప్రకటించిన భగవంత్ మాన్.. పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 

ప్రజాభిప్రాయం ఆధారంగా ఎంపిక..
దేశ రాజకీయాల్లో వినూత్న ప్రచార కార్యక్రమాలతో ఓటర్లను ఆకర్షిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోనూ అదే పద్ధతిని అవలంభించింది. ప్రజాభిప్రాయం ఆధారంగా సీఎంగా అభ్యర్థిని ఎంపిక చేసింది. ‘మీ ముఖ్యమంత్రిని మీరే ఎన్నుకోండి’ అంటూ పంజాబ్‌ ప్రజలకు పిలుపునిచ్చింది. సీఎం అభ్యర్థిగా ఎవరు కావాలో చెప్పాలని ఫోన్‌, వాట్సప్‌ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించింది. 93 శాతం మంది భగవంత్ మాన్ వైపు మొగ్గు చూపారని.. అందుకే ఆయన పేరు ఖరారు చేశామని మీడియా ముఖంగా కేజ్రీవాల్‌ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి రావాలని పంజాబ్‌ ప్రజలు కోరుకుంటున్నారని దీని ద్వారా అర్థమవుతోందని అన్నారు. 

ప్రజలు కోరుకోవాలన్నారు
సంగ్రూర్ నుంచి రెండో పర్యాయం లోక్‌సభకు ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న భగవంత్ మాన్.. సీఎం అభ్యర్థి అవుతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్‌ కూడా మొదటి నుంచి ఆయనపై సానుకూల ధోరణితో ఉన్నారు. అయితే ప్రజాభిప్రాయం ఆధారంగానే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక జరగాలని భగవంత్ మాన్ పట్టుబట్టినట్టు కేజ్రీవాల్‌ ఒకానొక సందర్భంలో వెల్లడించారు. 

‘భగవంత్ మాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతను నా చోటా భాయ్ (తమ్ముడు). ఆయన ఆప్‌లో అతిపెద్ద నాయకుడు. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని నేను కోరుకున్నాను. అయితే అది ప్రజలే నిర్ణయించాలని భగవంత్ మాన్ పట్టుబట్టార’ని కేజ్రీవాల్‌ తెలిపారు. బహుశా అందుకే కాబోలు.. సీఎం అభ్యర్థిగా మంగళవారం తన పేరును కేజ్రీవాల్‌ ప్రకటించగానే భగవంత్ మాన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆనంద భాష్పాలతో కేజ్రీవాల్‌ను గట్టిగా హత్తుకున్నారు. (చదవండి: ఏడుపు ఆపండి సార్‌! బీజేపీకి కాంగ్రెసే ఆశాకిరణం!)

 

కాంగ్రెస్‌, బీజేపీల నుంచి సవాల్‌
ఆమ్‌ ఆద్మీ పార్టీకి అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రధాన పోటీ ఎదురుకానుంది. అటు బీజేపీ-అమరీందర్‌ సింగ్‌ కూటమి, అకాలీదళ్ నేతృత్వంలోని సంకీర్ణం నుంచి కూడా సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని 117 నియోజకవర్గాల్లో 77 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆప్ 20 సీట్లు గెలుచుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. అకాలీదళ్ 15 సీట్లు గెలుచుకోగా, బీజేపీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో జోరు మీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈసారి పంజాబ్‌ ప్రజలు పట్టం కడతారో, లేదో వేచి చూడాలి. (చదవండి: ఈడీ దాడుల కలకలం.. పంజాబ్‌ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు)

>
Poll
Loading...
మరిన్ని వార్తలు