Punjab Election 2022: వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం!

11 Feb, 2022 11:42 IST|Sakshi

శిరోమణి అకాలీదళ్‌ను వెంటాడుతున్న గతం 

సంప్రదాయ ఓటు బ్యాంకులో క్షీణత 

మార్పు కోరుతూ ఇతర పార్టీల వైపు చూస్తున్న యువతరం 

చివరి అస్త్రంగా సిక్కు ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్న అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌ బాదల్‌ 

వందేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైప శిరోమణి అకాలీదళ్‌ తర్వాత శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (గురుద్వారాల పాలనా వ్యవహారాలు చూసే సంస్థ) అవసరాల నిమిత్తం రాజకీయ పార్టీగా అవతరించింది. గత ఏడాది డిసెంబర్‌ 14న 101 వార్షికోత్సవాన్ని జరుపుకొన్న ఈ పార్టీ ప్రస్తుతం పంజాబ్‌ ఎన్నికల్లో అత్యంత కఠిన పరిస్థితులకు ఎదురీదుతోంది.

సిక్కుల పార్టీగా దశాబ్దాలు హవా చలాయించిన శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ)కి ఈ పరిస్థితి రావడానికి 2007 నుంచి 2017 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. అధికారం కోల్పోయి ఐదేళ్లవుతున్నా.. ఆ కాలంలో పడిన ముద్రను తొలగించుకోవడానికి ఇప్పటికీ ఎస్‌ఏడీ గింజుకుంటూనే ఉంది. మరోవైపు పంజాబ్‌ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల పాటు అకాలీదళ్‌– కాంగ్రెస్‌ల మధ్యే ద్విముఖ పోరు ఉండగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం. 

బీజేపీ-అమరీందర్‌ కూటమి, రైతు సంఘాలతో కూడిన సంయుక్త సమాజ్‌ మోర్చాలతో ప్రస్తుతం పంజాబ్‌ రాజకీయాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. అకాలీదళ్‌ స్వయం కృతాపరాధానికి కారణాలేమిటి, వాటి నుంచి బయటపడటానికి ఎస్‌ఏడీ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ చేస్తున్న ప్రయత్నాలు, ప్రస్తుత పార్టీ పరిస్థితిపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం..

ముందు నుంచే దిద్దుబాటు చర్యలు 
జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌... ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ పోయారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు చోటిచ్చారు. 
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతాంగం రగిలిపోతుండటాన్ని గ్రహించిన సుఖ్‌బీర్‌ బీజేపీతో రెండు దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకొని... ఎన్డీయే నుంచి బయటికి వచ్చేశారు. 
భారత్‌లో మరే రాష్ట్రంలో లేనంతగా... పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుఖ్‌బీర్‌ 2021 జూన్‌లోనే బీఎస్పీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 నియోజకవర్గాలను కేటాయించారు. 2007లో 4.17 ఓట్ల శాతాన్ని, 2012 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 ఓట్ల శాతాన్ని సాధించిన బీఎస్పీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి దారుణంగా దెబ్బతింది. 1.59 శాతం ఓట్లు మాత్రమే పొందింది. 
అకాలీదళ్‌ అధికారంలోకి వస్తే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, ఇందులో ఒకటి బీఎస్పీకి కేటాయిస్తామని సుఖ్‌బీర్‌ ప్రకటించారు. దళిత ఓట్లను సాధ్యమైనంతగా ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎంను బీఎస్పీకి ఆఫర్‌ చేశారు. 

ఎన్నెన్నో కారణాలు...
ఏఎస్‌డీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయింది. 
ఇసుక మాఫియా చెలరేగిపోయింది. 
పంజాబ్‌ డ్రగ్స్‌ వాడకానికి భారత్‌లో కేంద్ర స్థానంగా మారిపోయింది. ‘ఉడ్తా పంజాబ్‌ (నిషాలో తేలిపోయే పంజాబ్‌)’గా పేరు స్థిరపడిపోయే స్థాయిలో ఇక్కడి యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారు. 
2015 ఫిబ్రవరి– ఏప్రిల్‌ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం.. ఎయిమ్స్, మరో స్వచ్చంద సంస్థతో కలిపి నిర్వహించిన సర్వేలో పంజాబ్‌లో 2.32 లక్షల మంది డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలయ్యారని తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో (మైనారిటీ తీరిన వారిలో) 1.2 శాతం మంది డ్రగ్స్‌ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇక డ్రగ్స్‌ అలవాటు ఉన్న వారి సంఖ్య 8.6 లక్షలుగా ఉందని తేలింది. 
2015లో అక్టోబరులో సిక్కుల పవిత్రగ్రంధం... గురు గ్రంధ్‌ సాహిబ్‌ను కొందరు దుండగులు అపవిత్రం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సిక్కులపైకి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన శిరోమణి అకాలీదళ్‌పై ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా పెంచేసింది.  
 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎస్‌డీ కేవలం 15 స్థానాలు మాత్రమే సాధించి... అవమానకరంగా మూడోస్థానానికి పడిపోయింది.  

సిక్కుల ఆత్మగౌరవ నినాదం
ఉత్తరప్రదేశ్‌లో  బీఎస్పీ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్నా... పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారపర్వంలో చురుకుగా పాల్గొనడం లేదు. ఇక ఆమె పంజాబ్‌పై దృష్టి సారించడంపై అకాలీదళ్‌ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. పైగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెచ్చిన సమయంలో శిరోమణి అకాలీదళ్‌ నరేంద్ర మోదీ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పదేపదే లేవనెత్తుతూ ఎస్‌ఏడీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. రైతుల్లో ఆగ్రహం తగ్గి అకాలీదళ్‌ను పూర్వస్థాయిలో ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ హయాంలో అయితే రైతుల్లో అనేక మంది తరతరాలుగా అకాలీదళ్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు.

కానీ నేటితరం ఆలోచన మారుతోంది. రాజకీయాల్లో వారు కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఫలితంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే సుఖ్‌బీర్‌ తండ్రిపై రైతుల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచుకోవాలనే ఉద్దేశంతో 94 ఏళ్ల వయసులో ఆయన్ను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తున్నారు. గతంలో ఐదుసార్లు  పంజాబ్‌ సీఎంగా వ్యవహరించిన ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ భారత్‌లో అత్యధిక వయసులో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తిగా  రికార్డులకెక్కారు.

ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గడం, కొత్త ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నామనే అంశాన్ని గ్రహించిన సుఖ్‌బీర్‌ సిక్కుల ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు. బెంగాల్‌ను బెంగాలీలే పాలించుకుంటారని, బయటివారు ఇక్కడ అక్కర్లేదంటూ ప్రచారం చేసి బీజేపీని మట్టికరిపించిన తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందిన సుఖ్‌బీర్‌ ఇప్పుడు అకాలీదళ్‌కు ఏకైక పంజాబీ ప్రాంతీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అకాలీదళ్‌ ప్రస్తుతం ఎదురీదుతోంది. పంజాబ్‌లో ఈనెల 20 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కెడ (అకాలీదళ్‌ ఎన్నికల గుర్తు కూడా) ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.!

మరిన్ని వార్తలు