పంజాబ్‌ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో..

21 Sep, 2022 21:34 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 22న పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అనుమతి నిరాకరించారు.  విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సీఎం భగవంత్ మాన్‌ ఈ సెషన్ నిర్వహించనున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు గవర్నర్ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు.

అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ అనుమతి నిరాకరించడంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. సభ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని,  రెండు రోజుల క్రిత అనుమతి ఇచ్చిన గవర్నర్ ఇప్పుడు చివరి నిమిషంలో ఆదేశాలను ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమైందని, అందుకే కేంద్రం నుంచి ఒత్తిడితోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ట్వీట్ చేశారు.

తమ ఎ‍మ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆశజూపారని పంజాబ్ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలోనే తమ బలం నిరూపించుకునేందుకు విశ్వాస పరీక్ష ఎదుర్కొంటామని, ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు.

ఇదే ఆరోపణలతో ఢిల్లీ అసెంబ్లీలో సెప్టెంబర్ మొదటివారంలోనే విశ్వాసపరీక్ష ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీకి చెందిన ఒక్క ఎ‍మ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్‌ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు