బంట్రోతును కాను.. కేసీఆర్‌ కేబినెట్‌లో‌ మంత్రిని..

3 Dec, 2020 05:23 IST|Sakshi

నారాయణపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఫైర్

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీపీఐ నేత నారాయణ బీజేపీలో ఎప్పుడు చేరారో తనకు తెలియదని, కూకట్‌పల్లిలో బీజేపీ కార్యకర్తలు తనపై చేసిన హత్యాయత్నాన్ని నారాయణ సమర్థిస్తున్నారా?’అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ సందర్భం గా కూకట్‌పల్లి నుంచి తన వైద్య కళాశాలకు వెళ్తుండగా.. బీజేపీకి చెందిన 200 మంది కార్యకర్తలు తనపై దాడికి పాల్పడి హత్య చేసేందుకు ప్రయత్నించారన్నారు. తన సెక్యూరిటీ సిబ్బంది, అక్కడి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రతిఘటించడంతో తాను సురక్షితంగా బయటపడ్డానన్నారు. తనపై దాడి ఏవిధంగా జరిగిందో తెలుసుకో కుండా నారాయణ తనను బర్తరఫ్‌ చేయాలంటూ వ్యాఖ్యానించడంపై మం త్రి తీవ్రంగా మండిపడ్డారు. బర్తరఫ్‌ చేయడానికి తాను మఖ్దూం భవన్‌లో బంట్రోతును కాదని, కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రినని.. ఆ విషయాన్ని నారాయణ గుర్తించాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకనే బీజేపీ ఈ తరహా దాడులకు ఒడిగట్టిందని, బాధ్యత కలిగిన మంత్రిగా ఉండి పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఎలా వెళ్తానని, తాను వెర్రిపువ్వును కాదన్నారు.  

పార్టీలు మార్చే చరిత్ర నాది కాదు
మంత్రి అజయ్‌పై సీపీఐ నేత నారాయణ ధ్వజం 

పార్టీలు మారే అనైతిక చరిత్ర తనది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ‘సీపీఐ నారాయణ బీజేపీలో చేరారేమో!’అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన అనైతిక చరిత్ర అజయ్‌దేనన్నారు. తాను మగ్దూం భవన్‌ బంట్రోతును కాదంటూ మంత్రి పేర్కొనడంపై బుధవారం నారాయణ స్పందిస్తూ అజయ్‌ మఖ్ధూం భవన్‌ దయాదాక్షిణ్యాల మీదే ఎదిగారన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవుపలికారు. మంగళవారం జరిగిన ఘటనలో మంత్రి కారుపై ఒక యువకుడు కూర్చున్నపుడు దానిని వేగంగా తీసుకెళ్లడం వల్ల అతడి ప్రాణాల కు ప్రమాదం ఏర్పడి ఉండేదన్నారు. మంత్రి తప్పు చేయకపోతే ఎందుకు పరుగులు పెట్టారని ప్రశ్నించారు. అక్కడ బీజేపీ వాళ్లు తరిమారో వేరే వాళ్లు తరిమారో తనకు తెలియదన్నారు. వాస్తవాలు చెప్పినందుకు తనపై బురద చల్లితే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లే అవుతుందని నారాయణ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు