Rajasthan Assembly polls: రాజస్థాన్‌ ఎవరిదో!

24 Nov, 2023 05:32 IST|Sakshi

199 స్థానాల్లో రేపే పోలింగ్‌

హామీలే గెలిపిస్తాయంటున్న కాంగ్రెస్‌ పార్టీ

హిందూత్వ కార్డుపైనే బీజేపీ భరోసా

ఎవరికీ చిక్కని ఓటరు నాడి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్‌ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్‌ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్‌ గెహ్లోత్‌ నమ్ముతున్నారు.

దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్‌ 30న తెలంగాణలో పోలింగ్‌ ముగిశాక డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే...

2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్‌ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్‌ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్‌ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

2013
ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్‌ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 33.1 శాతం దక్కాయి.

గుజ్జర్‌ నేత కిరోరీసింగ్‌ బైన్స్‌లా దన్ను కాంగ్రెస్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్‌ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్‌ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్‌ గెహ్లోత్‌ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది.
 
2018

ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్‌గా యువ నేత సచిన్‌ పైలట్‌ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది.

ఆళ్వార్, దౌసా, సవాయ్‌ మధోపూర్, టోంక్, ధోల్‌పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్‌ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్‌ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్‌కే చాన్స్‌ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్‌ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు